వాకింగ్ ట్రాక్ మీద పార్క్ చుట్టూ ఓసారి తిరిగి వచ్చి సిమెంట్ బెంచ్ మీద కూర్చొని.. నుదుటికి పట్టిన చెమటలను తుడుచుకొని ఓసారి రిలాక్స్డ్ గా కూర్చొంది నీరజ.
ఎదుటి బెంచికేసి చూసింది.. ఎవరూ లేరు. గత రెండు రోజులుగా ఓ అబ్బాయిని చూసింది.. ఈవేళ లేడు. ఎందుకు రాలేదో అని ఓసారి అనుకొంది.అయితే తన ఆలోచన సిల్లీగా అనిపించింది. రెండు రోజులుగా చూసింది అంతే! నిజం చెప్పాలంటే రెండు రోజులుగా అతన్ని గమనించింది.
సారధి ఏదో బిజినెస్ మీటింగ్ కని గోవా వెళ్ళడంతో, "నేను లేనని వాకింగ్ మానద్దు "అని తెల్లవారి లేవగానే గుర్తు చేయడంతో వచ్చింది తను.
సారధి లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళడం ఇష్టం వుండదు నీరజ కు. అయితే సారథి మరీ మరీ చెప్పడంతో వచ్చింది. పార్క్ లో ఎక్కువ రద్దీలేదు.అది ఇష్టం నీరజకు. ప్రశాంతంగా వుంటుంది.
ఆ పార్క్ చుట్టూ అపార్ట్మెంట్లు . మధ్యలో పార్క్ .రకరకాల పూలమొక్కలు, నడవటానికి ట్రాక్ మధ్యలో సిమెంట్ బెంచీలు, అక్కడక్కడ పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు, జిగ్గ్, స్వింగ్లు, జారుడు బల్లవగైరాలు వున్నాయి. ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్ కొంతమంది వస్తారు.
సారథీ లేకుండా మొదటిసారి వచ్చినరోజు 'ఏమ్మా! సారథీ లేడా! ఊరెళ్ళాడా? ఎన్నిరోజులు' అని ఎంక్వయిరీ చేశారు కొంతమంది.
అంతే అంతకుమించి తమ సంభాషణ ముందుకు వెళ్ళదు.
నీరజ కు కూడా అలా ఎక్కువగా మాట్లాడేందుకు కల్పించుకొని కబుర్లు చెప్పే ఆసక్తి వుండదు.
రెండురోజుల క్రితం మొదటిసారిగా ఆ అబ్బాయిని తను మామూలుగా కూర్చొనే సిమెంట్ బెంచి కి ఎదురుగా వున్న బెంచిమీద చూసింది. తననే చూస్తున్నట్టు అనిపించింది. సరే అని అనుకొని వుండిపోయింది.
ఎవరు ఆ అబ్బాయి ఎక్కుడుంటాడు. ఎందుకు తననే చూస్తున్నాడు అని పలు రకాల ప్రశ్నలు వేస్తున్న మనసుకు ఏమీ సమాధానం చెప్పకుండా ఊరికే వుండిపోయింది. మరోసారి తనే పొరపాటు పడిందా! తన వయసెంత! తనకన్నా ఎంతో చిన్న వయసు ఆ అబ్బాయికి.. రెండు రోజులు చూసినా ఆ అబ్బాయి కళ్ళలో వున్న మెరుపు ఆకట్టుకొంది నీరజకు. సభ్యత కాకపోయినా ఆ నవ్వు ముఖంలో ఏదో ప్రత్యేకత వుంది అని అనిపించసాగింది.
ఇంటికొచ్చాక కూడా అప్పుడప్పుడూ ఆ అబ్బాయి గుర్తుకురాసాగాడు.
ఎందుకు తను ఆ అబ్బాయిని మరువలేకపోతున్నది . రెండు రోజులుగా ఆ బెంచిమీదనే కూర్చొనివున్నాడు.
తాను వాకింగ్ ముగించి వచ్చేవరకూ కూర్చొనే వున్నాడు. మొదట ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నాడేమో అనిపించింది. అయితే ఎవరూ రాలేదు.
కనీసం మొబైల్లో మెసేజ్ లు కూడా చూసుకోవడం లేదు. ఊరికే కూర్చొని నన్నే చూస్తున్నాడని అనిపించింది. ఆ అబ్బాయిని అంతకుమునుపు ఎక్కడయినా చూసానా! అన్న అనుమానం వచ్చి ఆలోచించసాగింది.
అయితే తను ఆ అబ్బాయిని మొదటిసారి ఆ పార్క్ లో నే చూసింది. ఎవరతను అని చాలా సార్లు ఆలోచించి తన రొటీన్ లో పడి పోయింది. మధ్య మధ్యలో సారధి ఫోన్ చేస్తున్నా అతనికి అన్యమనస్కంగానే సమాధానం చెప్పింది. ఓసారి సారధికి అనుమానం వచ్చి 'ఏమిటి? నీరజ! అలా వొడివొడిగా మాట్లాడుతున్నావు. ఒంట్లో బాగాలేదా. నా గురించి బెంగనా' అన్నాడు.
సారధిని వదిలి ఒంటరిగా వుండలేదు నీరజ. అప్పుడప్పుడు బిజినెస్ మీటింగులకు వేరే ఊర్లకు వెళ్ళినా 'బోర్ కొడుతుందేమో 'అన్న
సారథి మాటలను ఖండిస్తూ 'కనీసం మిగతా సమయంలో మనం కలిసి ఉండచ్చు 'అని పట్టుపట్టి ప్రతిసారి సారథి జతలో బయలుదేరేది. అయితే ఎందుకో ఈసారి! 'నాల్గురోజులేగా! మీరు వెళ్ళి రండి' అన్న నీరజ మాటలకు ఆశ్చర్యపోయాడు.
'నిజంగానే అంటున్నావా!' అని ఓసారి నీరజవైపు చూసాడు.
'నిజంగానే చెబుతున్నాను. నాకేం పరవాలేదు. మీరు వెళ్ళిరండి' అని పంపింది.
అయితే ఎప్పుడూ సారథి ని వదిలి ఉండని తను రెండు రోజులకే డీలాపడిపోయింది.
అందుకే ప్రతి రెండు గంటలకు ఓసారి ఫోన్ చేయసాగింది. విసుక్కోకుండా ఫోన్లో మాట్లాడుతున్న సారధిని
తలచుకొని 'ఏమి మనిషి ఇతను. ఈ మనిషికి కోపం రాదా! తన వర్క్ ను డిస్టర్బ్ చేస్తున్నా తనమీద ఒకసారి కూడా విసుక్కోకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు' అని ఆశ్చర్యపోసాగింది.
సారధితో ఆ అబ్బాయి గురించి చెప్పాలా అన్న ఆలోచన వచ్చింది. ఏం చెప్పాలి. పార్క్ లో రెండు రోజులుగా ఓ అబ్బాయి కనిపించాడు! ఈరోజు ఎందుకో రాలేదు అని చెప్పాలా! చెబితే సారథి రియాక్షన్ ఎలా వుంటుంది. అది అంత ముఖ్యమైన విషయమా! సారథికి చెప్పడానికి నిజం చెప్పాలంటే తను కూడా అంత ఆలోచించనవసరం లేదు. రెండు రోజులు కనిపించిన ఆ అబ్బాయి మూడోరోజు రాకపోతే ఎందుకు రాలేదు! అనేది సిల్లీ విషయమేకదా! ఏ పని చేస్తున్నా ఆ అబ్బాయే గుర్తు రాసాగాడు.
ఎందుకు నన్నే చూస్తున్నాడు. తను ఆ అబ్బాయికి తెలుసా! తెలిస్తే దగ్గరకొచ్చి ఎందుకు మాట్లాడలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది నీరజకు.
చివరికి' చూద్దాం రేపు వస్తాడేమో 'అని సమాధాన పర్చుకొంది.
మరుసటిరోజు ఉదయాన్నే పార్క్ కేసి బయలుదేరింది. తను కూర్చున్న బెంచికేసి చూసింది. ఆ అబ్బాయి కూర్చొని వున్నాడు. చాలా సంతోషంగా అనిపించింది. నీరజకు ఆశ్చర్యమేసింది తను గమనించినట్టే ఆ అబ్బాయి కూడా నీరజను చూసాడు. ఏదో పోగొట్టుకున్న వస్తువు దొరికిన ఫీలింగ్ అది. గబ గబా బెంచ్ కేసి నడిచింది. నీరజను చూడగానే ఆ అబ్బాయి లేచి నిల్చున్నాడు. 'సారీ! ఇది మీ సీట్' అని అన్నాడు.
"ఎందుకు ఏమిటి? నా సీటేమిటి ఇది పబ్లిక్ పార్క్, నేనిక్కడే కూర్చొని వుంటానన్న విషయం నీకు తెలుసా! ఇంతకు నీనెవరు! ఎందుకు నన్ను చూస్తున్నావు. నేను మీకు తెలుసా ఎలా తెలుసు. "అని ప్రశ్నల వర్షం కురిపించింది నీరజ.
"మేడమ్ !నా పేరు యదునందన్. నేను దాదాపు పదిహేను రోజులుగా ఈ పార్క్ లో మిమ్మల్ని చూస్తున్నాను. బహుశా మీరు గమనించలేదనుకుంటా! సార్ జతలో నడుస్తుంటారుకదా! సార్రా లేదా! మేడం' అన్నాడు..
'సార్ ఊరికెళ్ళారు 'అని చెప్పి.. 'చూడు బాబు నేను నీకు తెలుసా! ఎందుకు నన్నే చూస్తున్నావు.
నాతో ఏమయినా పనివుందా? నిన్న ఎందుకు రాలేదు "అని అడిగింది నీరజ.
'అమ్మను హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. రొటీన్ చెకప్' అన్నాడు యదు.
'నీవేం చేస్తున్నావ్?' అని ప్రశ్నించింది. ప్రక్కలో కూర్చొంటూ.
యదునందన్ కొత్తగా అనిపించలేదు. ఏదో ఆత్మీయత మనసంతా ఆవరించుకొంది నీరజకు.
అబ్బాయి కళ్ళలో ఏదో మెరుపు. ఆ కళ్ళు చూస్తుంటే తనకు చాలా దగ్గరయిన వారి కళ్ళు మాదిరి అనిపించసాగింది.
"అమ్మా! నేను యం.బి.ఎ. చేశాను. బెంగుళూరుకు వచ్చి 3 నెలలు అవుతోంది. బొంబాయిలో వుండేవాడిని. నాన్నగారు లేరు. అమ్మ, నేను. అమ్మ టీచర్ గా పనిచేసేది. ఓ సంవత్సరం నుండీ ఇంట్లోనే వుంటుంది. ఇక్కడికి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాము. సార్ సారథి గారు కదా! మంచి ఆర్కిటెక్ అని విన్నాను. లానెల్ రోడ్డులో ఆఫీసు ఉందికదా! "అన్నాడు. 'ఈ అబ్బాయి తమ గురించి చాలా ఎంక్వయిరీ చేసాడే' అని ఆశ్చర్యపోయింది.
నా అనుమానాలను గుర్తించినట్టు!
"మీ గురించి తెలుసు. మీరు ఇక్కడికి రాక ముందు బొంబాయిలో ఓ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేసేవారు. మీకు ఓ అబ్బాయి చైతన్య అనుకొంటా ! ఇంజనీరింగ్ చదువుతూ యాక్సిడెంట్లో చనిపోయాడు. మీరు బెంగుళూర్ వచ్చారు" అని కాస్త ఆగాడు యదునందన్.
బాబు విషయం గుర్తుకురాగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి నీరజకు. అయితే సారథికి మాట ఇచ్చింది బాబు గురించి బాధపడనని.. ఆలోచించనని. అందుకని ఉబికివస్తున్న కన్నీటిని
బలవంతంగా ఆపుకొని" చాలా సంతోషంగా వుంది బాబు నిన్ను చూస్తుంటే! అయితే మా గురించిన
ఇన్ని వివరాలు ఎవరు చెప్పారు. నీకెందుకు ఇంటరెస్ట్.. మాకు.. నీకు ఏమిటి సంబంధం" అన్న
ప్రశ్నవేసింది "తప్పకుండా చెబుతాను మేడమ్. మిమ్మల్ని చూడాలనే బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీతో ఎలా మాట్లాడాలి? ఎలా కలుసుకోవాలి? అన్న ప్రశ్నలతోనే గత 15రోజులుగా ఈ పార్క్ లోకి వస్తున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. మీ అబ్బాయిలాంటివాణ్ణి. సార్ ని కూడా కలుసుకొని అన్ని విషయాలు చెబుతాను "అన్నాడు.
"సార్! ఊరిలో లేడు, రేపు వస్తారు.
సార్ తో మాట్లాడతాను. నీ నంబర్ ఉంటే ఇవ్వు .ఎప్పుడు రావలసినది చెబుతాను" అందినీరజ.
అయితే ఎన్నో అనుమానాలు ఆలోచనలు.. నీరజకు." ఎవరీ యదునందన్. ఈ అబ్బాయికి తమ గురించి ఆరా తీయవలసిన అవసరమేముంది. నిజంగా నమ్మదగ్గ వ్యక్తేనా! తన గురించిన
వివరాలు ఎలా తెలుసుకున్నాడు. పైగా తమకోసమే బెంగుళూరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని చెబుతున్నాడు. దీనికర్థమేమిటి? "సారథి వచ్చే వరకు ఆగలేకపోయింది. ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పింది .
విషయం విన్న సారథికి కూడా ఆశ్చర్యం. అనుమానం వేసింది. ఏది ఏమయినా ఆ అబ్బాయితో మాట్లాడేంతవరకు నీరజను కలుసుకోవద్దని చెప్పాడు సారథి.
గేట్ తీసుకుని లోనికి వస్తున్న వ్యక్తిని లోపలినుండే గమనించి డ్రాయింగ్ రూమ్ నుండి
బయటికి వచ్చి "ఎవరూ ?"అన్నాడు.
"సార్ !నా పేరు యదునందన్ నీరజ మేడమ్ ఈరోజు రమ్మన్నారు "అన్నాడు వినయంగా.
అతని మాట, ప్రవర్తన సారథిని ముగ్ధుణ్ణి చేశాయి.
'ఓ యదునందన్! ఎలా వున్నావు! కమాన్' అంటూ ఆహ్వానించాడు.
'సార్! మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది. సారీ! మిమ్మల్ని ఏమయినా
ఇబ్బంది పెట్టి వుంటే' అన్నాడు.
'అలాంటిదేమీ లేదు' అయితే ఎప్పుడూ చూడని పరిచయం లేని వ్యక్తని నీరజ నీ గురించిన
వివరాలు చెబుతుంటే ఆశ్చర్యం, భయం కలుగచేశాయి. అది సహజమే కదా! రా! కూర్చో..
నీవెవరు! మా గురించి నీకెలా తెలుసు. అసలు మమ్మల్ని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నావు.
నీరజ మాటల్లో నీవు మా కోసమే బెంగుళూరు వచ్చినట్టు చెప్పింది. ఎందుకు? "అన్నాడు సారథి.
అంతలో నీరజ రావడం చూసి "నమస్తేనమ్మా! ఎలా వున్నారు. రెండు మూడు రోజులుగా
పార్కు రాకపోయేసరికి భయం వేసింది. నా అతి ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టిందేమో, నన్ను
చూడ్డం ఇష్టం లేదేమో అని బాధేసింది. నిన్న మీ ఫోన్ చూసి చాలా సంతోషమయింది కృతజ్ఞతలు" అన్నాడు.
'కూర్చో! నేను కాఫీ తెస్తాను' అని లోనికి వెళ్ళింది.
'ఇప్పుడేమీ వద్దు' అన్నా వినకుండా రెండు కప్పులతో కాఫీ తీసుకొని ఇచ్చింది ఇద్దరికీ!
'ఇప్పుడు చెప్పు. ఎవరు నువ్వు? మా గురించి అన్ని వివరాలు వాకబు చేస్తున్నట్టుంది.ఏమిటిది? కాస్తా కరుకుగా ధ్వనించింది "సారథి స్వరం.
'సార్ మీరు అపార్థం చేసుకోకండి. నావల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. క్షమించండి.
చెబుతాను సార్ !"అంటూ ప్రారంభించాడు.
::::::
'హలో యదునందన్ ఎలా వున్నావు' అన్నాడు.
డా॥ అనిల్ యదునందన్ ను చూడగానే.రొటీన్ చెకప్ కు వచ్చాడు యదు. డా॥ అనిల్ తో పాటు నాలుగైదుమంది వున్నారు.అందరూ డాక్టర్ స్ లాగానే వున్నారు.
"బాగున్నాను సార్! మీవల్ల ఈ లోకాన్నిచూడగలుగుతున్నాను"
అన్నాడు.
"డియర్ ఫ్రెండ్స్! మీట్ దిస్ యంగ్ మ్యాన్. ఆరు నెలల క్రితం ఇతనికి సర్జరీ చేసి కళ్ళను అతికించాము. ఇప్పుడు ఇతను చేసే సేవ వలన
ఐ డోనర్స్ దాదాపు నాలుగు వంతులు పెరిగారు.
ప్రతినెలా తన జీతంలో 25% కంటి ఆపరేషన్స్ లకుఖర్చుపెడుతుంటాడు. బీద వాళ్ళకు ఉచిత ఆపరేషన్స్ కు సహాయపడుతూ వుంటాడు. యదునందన్ చేసే సర్వీసు ముందు మేము చేసే సర్వీసు
చాలా చిన్నది అనిపిస్తుంది నిజంగా యదునందన్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత అయినా
అవసరం "అన్నాడు డా॥ అనిల్ యదునందనన్ను అందరికీ పరిచయం చేస్తూ!
అందరికీ నమస్తే చెబుతూ.. "డా॥ అనిల్ గారు నాకు ప్రాణదాత.. ఆయన వల్లనే ఈ లోకాన్ని
చూడగలుగుతున్నాను. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను "అన్నాడు యదునందన్.
"సార్! మీ తో కాస్తా మాట్లాడాలి. మీ మీటింగ్ అయ్యేంతవరకు ఎదురుచూస్తాను "అని బయట
కుర్చీలో కూర్చొన్నాడు యదునందన్.
ఓ అరగంట తరువాత 'సార్ మిమ్మల్ని డాక్టరు పిలుస్తున్నార'న్న మాటతో లోనికి వెళ్ళాడు.
'కూర్చో యదు ఏమిటి? ఏదో మాట్లాడాలన్నావ్?' అన్నాడు డా॥ అనిల్.
'సార్! నాకు నేత్రదానం చేసిన వాళ్ళను కలుసుకోవాలని వుంది. నాకు తెలుసు అది రూల్స్ కు
విరుద్ధమని. అయినా ఎందుకో వాళ్ళను పర్సనల్ గా కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని." అన్నాడు యదునందన్ .
ఓ నిముషం ఆలోచించి. "మామూలుగా అయితే క ళ్ళు డొనేట్ చేసిన వ్యక్తుల గురించిన
వివరాలు గుప్తంగా వుంటాయి. అయినా కష్టమేమీ కాదు. చూద్దాం.. నేను హాస్పిటల్
మేనేజ్మెంట్తో మాట్లాడతాను "అన్నాడు డా॥ అనిల్.
చాలా సంతోషంగా ఫీలయ్యాడు యదునందన్.
రెగ్యులర్ గా డా॥ అనిల్ ని కలిసి కళ్ళను దానం చేసిన వాళ్ళ గురించి ఎప్పుటికప్పుడు విచారిస్తూ చివరికి వాళ్ళు బెంగుళూరులో ఉన్న సారథి, నీరజ దంపతులనితెలుసుకున్నాడు.
వాళ్ళ గురించిన వివరాలు
డా॥ అనిల్ ద్వారా తెలుసుకున్నాడు.
'సార్ !నేను వాళ్ళను పర్సనల్ గా కలవచ్చా. వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ వుంటే విచారించి ఇవ్వ గ లరా?"
అన్నాడు ఓసారి కంటిదాతల వివరాలు తెలిసాక.
"చూడు యదూ! వాళ్ళు ఏదో సమయంలో కళ్ళు దానం చేసే నిర్ణయం తీసుకొని వుంటారు
వాళ్ళకు నిన్ను కలుసుకునే ఇష్టం వుందో లేదో! పైగా జీవితంలో జరిగిపోయిన విషాదఘట్టాన్ని
పునరావృతం చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు "అన్నాడు అనిల్ .
'సార్! వాళ్ళను ఓసారి కలుస్తానంతే!' అన్నాడు అభ్యర్థనగా!
'నీ ఉద్దేశ్యం మెచ్చతగినదే! అయితే వాళ్ళ వాళ్ళ ఇష్టం ఎలా వుంటుందో చెప్పలేము' అన్నాడుడా॥ అనిల్.
"ట్రై చెయ్యండి సార్! నా అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది" అని వచ్చేసాడు యదునందన్
ఓ పదిహేను రోజుల తరువాత డా॥ అనిల్ ఫోన్ వచ్చింది యదునందన్.. మిస్టర్
యదునందన్ !వాళ్ళు నిన్ను కలుసుకోవడానికి ఒప్పుకొన్నారని వాళ్ళ అడ్రస్ ఇచ్చారు.
చాలా సంతోషపడిపోయాడు యదునందన్.
విషయం తెలుసుకున్న సారథికి డా॥ అనిల్ ఆ మధ్య ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చింది. నీరజకు చెప్పి మరలా ప్రశాంత్ విషయం గుర్తు చేయడం బాధపెట్టడం ఇష్టం లేకపోయింది. చూద్దాం ఆ అబ్బాయి వచ్చాక అనుకొని ఊరికే ఉండిపోయాడు.
తరువాత ఆ విషయమే మరిచిపోయాడు.
నీరజ సంబరంగా యదునందన్ కళ్ళవైపు తేరిపార చూసింది. తమ కళ్ళ ఎదుట కొడుకు
ప్రశాంత్ ఉన్నట్టు ఫీలవసాగింది. సారధి కూడా ఏదో తెలియని ఉద్వేగంతో మౌనంగా
చూడసాగాడు.
"సార్! మిమ్మల్ని చూడాలన్న ఆతురతతో మిమ్ములను బాధపెడుతానన్న విషయం
మరిచిపోయాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఏమీ కోరను. నాకు చూపు వచ్చి ఈ లోకాన్ని చూసే
అవకాశమిచ్చిన వీకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను. మీరిచ్చిన ఈ చూపుతో మిమ్ములను కళ్ళారా
చూడాలని వచ్చాను" అని సారథి కాళ్ళకు నమస్కరిస్తున్న యదునందన్ ను ప్రేమగా కౌగిలించుకొని
"థ్యాంక్స్! యదునందన్. బాధలో కూడా ఇంత మాధుర్యముంటుందని ఇప్పుడే తెల్సుకుంటున్నాను.
నీవెప్పుడూ మాకు ఆత్మీయుడవే "అని దగ్గరికి తీసుకున్నాడు సారథి .
ఆ ఆప్యాయతకు మనసంతా సంతోషంతో నిండిపోయింది యదునందన్ కి .