నా అస్తిత్వం!! (కథానిక)

Advertisement
Update:2022-11-27 13:26 IST

నా అస్తిత్వం!! (కథానిక)

చుట్టూ చూస్తున్నాను. నా చుట్టూ.

అందరూ విషాద వదనాలతో ఉన్నారు.

ఎవరో-

"రా జానకి ! ఇక్కడ కూర్చో అన్నారు.

ఎవరెవరో ఉన్నారు.

చుట్టూ చూస్తున్నాను చేష్టలుడిగి.

నా భర్త చనిపోయాక నన్ను మా ఊరికి తీసుకొచ్చారు.

నేనసలు ఎలా రాబడ్డానో కొన్నేళ్ళు గడిచిపోయినా గుర్తు రాలేదు.

నాకసలు ఏడుపు రావడం లేదు.

నాకు నా భర్త పోయిన విషయం నిజమని అందడంలేదు.

అదొక షాక్.

నన్ను చూడడానికి ఎవరెవరో వస్తున్నారు.

చాలా ఆకలిగా ఉంది.

నేను ఎక్కడా ఏడవలేదు.

భోజనాలు పెట్టారు.

తింటుంటే ప్రాణం లేచి వచ్చింది.

వడ్డిస్తున్న ఆవిడని -

"ఇంకొంచెం పచ్చడి వెయ్యారా? నాకు వెలక్కాయ పచ్చడి అంటే ఇష్టం !" అన్నాను.

అందరూ నా వైపు టక్కున చూసారు.

" ఒక పక్క భర్త పోతే అలా అడగొచ్చా?" అన్నారు ఎవరో.

నా భర్త కి జబ్బేమిటో ఎవ్వరూ ఎక్కడా కనుక్కోలేకపోయారు.

అందుకు ఒంటి మీద స్పృహ లేని నా భర్త ని హాస్పిటళ్ళ చుట్టూ ఊరూరు తిప్పి తిప్పి తిరిగి తిరిగి నా కూతురు, నా కొడుకు, నేను సరి అయిన తిండి తిని రెండు ఏళ్ళు అయింది.

ఎప్పుడూ సేవ.

నా భర్త మీద మా కందరికి ఎనలేని ప్రేమ, ప్రాణం.

అటువంటి ప్రాణాన్ని కోల్పోయాక నాకు ఆకలి వేసింది.

ఆకలి శరీరానికి సంబంధించినది కదా?

అలా అడగకూడదు అన్నా ఆకలి ఆగదు.

నేను సిగ్గు వదిలేసి పొట్టనిండా తిన్నాను.

12 వరోజు నన్ను పుట్టింటికి తీసుకెళ్ళడానికి మా అన్నయ్య వచ్చాడు.

చాలా రోజులకి అడిగి మరీ అన్నీ తినేసినందుకు మోషన్స్ పట్టుకున్నాయి.

కానీ నన్ను పుట్టింటికి తీసుకుపోతున్నారు.

త్రోవ నిండా మోషన్స్.

రోడ్డు మీదే కారు ఆపితే చెట్లవెనుక కి వెళ్ళి వస్తుంటే మొహం తిరిగిపోయేది.

అలా ట్రాన్స్ లోనే పుట్టింటికి చేరాను.

అప్పుడు మళ్ళీ నన్ను చూడవచ్చే జనం.

జీలకర్ర నోట్లో వేసుకుని మరీ చూడాలట.

జీలకర్ర వేసుకోవడం నేను చూస్తుండగానే అక్కడున్న సింక్ లో ఉమ్మడం.

నేను పుణ్య స్త్రీ ఇక కాదట.

నాకు ఏమి జరుగుతోందో తెలియడం లేదు.

★★★★★

పది రోజులు గడిచాక నేను మా అబ్బాయి కట్టిన ఇంటికి వచ్చాను.

అబ్బాయి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు.

అక్కడి నుంచి మొదలయింది తరువాత జీవితం.

నేను చీరలు కట్టుకోవడం మానేసి కొన్నేళ్ళు అయింది.

డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాను.

లిఫ్ట్ దగ్గర నించున్నాను.

" అప్పుడే బయటికి వచ్చేసారా?" అడిగారొకరు.

లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ మూడో ఫ్లోర్ నుంచి వచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఆగింది.

" మా అమ్మాయికి ఎగ్జాం. మీరు తరువాత రండి ప్లీస్"అతని మొహం లో చిరాకు.

నాకేదో అర్ధం అయి అవనట్టు ఉంది.

ఆ తరువాత మా చెల్లెలు దయతో నన్ను ఒక ఆర్గనైజేషన్ లో సేవా కార్యక్రమానికి వాలంటీర్ గా తీసుకెళ్ళింది.

నాకు ఆ సేవ బాగానే ఉంది. కానీ అంతా అయోమయంగా నే కాలం గడుస్తోంది.

నన్ను నేను మరిచిపోయాను. ఇంటికి ఎవ్వరూ రావడం లేదు.

భర్త లేకపోతే ఇన్ని మార్పులు వస్తాయని నేను ఊహించనే లేదు.

ఇంట్లో నా పెర్సొనల్ కాగితాల్ని

తీసాను.

నేను రాసి పెట్టుకున్న కవితలు, భావావేశాలు, పిల్లల ఫీజుల కోసం నేను రాసిన రేడియో నాటకాలు, గొప్ప సంగీత విద్వాంసురాలితో టెంపుల్స్ లో ఇచ్చిన ఒక్కో కీర్తనకి నేనిచ్చిన వ్యాఖ్యానాలు.

చాలా గొప్ప పేరున్న నృత్యకళాకారిణి 'చండాలిక ' నృత్య నాటకానికి నేను కొంత మంది పండితోత్తములని కలిసి వారిని అడిగి తెలుసుకుని స్వయంగా రాసిన సమీక్ష ని కళాభారతి లాంటి ఆడిటోరియంలో వ్యాఖ్యానంచేస్తున్నప్పుడు

నృత్యం చేసున్న వారు కన్నీళ్ళతో స్టేజ్ మీదకి వచ్చి కృతజ్ఞతల్ని తెలియజేసిన వన్నీ చుట్టూ పరుచుకుని చూసాను.

అప్పుడు మెచ్చుకున్న వారంతా ఏరి?

ఎక్కడ?

భర్త చనిపోతే నా తప్పేం ఉంది?

ఎందుకు అందరూ నన్ను విచిత్రంగా

చూస్తున్నారు?

★★★★★

నాలుగు రోజుల తరువాత-

అక్కడ నేను ఆర్గనైజేషన్ లో వాలంటీర్ ని.

ఒక కొత్త లోకం.

అక్కడికి వచ్చిన వారిలో ఒక కవి ఉన్నారు.

ట్రైనింగ్ లో ఒక భాగంగా నేను వారితో సంభాషిస్తూ-

" నాకూ కవిత్వం రాయాలని ఉంది!" అన్నాను.

ఒక సభకి అతను ఆహ్వానిస్తూ నాలుగు రోజుల్లో జరిగే కవి సమ్మేళనానికి మంచి కవిత రాసి తీసుకు రమ్మని అడ్రెస్ ఇచ్చారు.

నేను అమిత శ్రద్ధతో రాసి తీసుకు వెళ్ళాక అలా కాదని-

కవిత్వం ఎలా రాయాలో గంటన్నర చెప్పారు.

మర్నాడు నేను పట్టుదలతో రాసి పట్టుకెళ్ళాను.

ఒక పోటీకి పంపమని అక్కడే నా చేత పోష్ట్ చేయించారు.

అది జాతీయ స్థాయి అవార్డుల పోటీ. నాకు నవ్వు వచ్చింది. నేను డైరెక్ట్ గా అవార్డ్ పోటీలకు రాయడం ఏమిటి?

అది నా మొట్ట మొదటి కవిత.

ఇంటికి వచ్చేసాను.

పది రోజుల్లో నాకు అవార్డ్ వచ్చిందని దాన్ని అందుకోడానికి హైదరాబాద్ రమ్మని ఆహ్వానం.

వెళ్ళాను.

ఒక మహా కవి, మరో మహా కవయిత్రి, ఒక కలెక్టర్ అధ్వర్యం లో నాకు ఆ అవార్డు లభించింది.

అక్కడికి వచ్చి అవార్డ్ లని అందుకుంటున్న కవి మిత్రులు నన్ను ఒక కవయిత్రి గా గుర్తించారు.

న్యూస్ పేపర్ల వారు నా పరిచయాన్ని ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళారు.

మర్నాడు పేపర్లలో వచ్చింది.

నేను సీరియస్ గా రాయడం మొదలు పెట్టాను.

రెండో అవార్డ్ వచ్చింది.

బహుమతులు వస్తున్నాయి.

అందరూ నన్ను నా పేరు ముందు కవయిత్రి,రచయిత్రి అని పిలుస్తూ గౌరవం ఇస్తున్నారు.

అందరూ వారంతట వారే పలకరించి నన్ను అభినందిస్తున్నారు.

అందరూ మా ఇంటికి వస్తున్నారు.

ఇప్పుడు నా ఉనికి ప్రకటితం అయి నన్నొక మనిషిగా గుర్తిస్తున్నారు.

నన్ను నన్నుగా గుర్తిస్తూ

ఇది నా జీవితానికి ఒక స్త్రీ గా నా గొప్ప గెలుపు.

నాకు మా నాన్నగారు, మా అమ్మ,నా భర్త దీవిస్తున్నట్టుగా ఉంది.

నేను హాయిగా ఆకాశంవైపు చూస్తూ నేను రాసి ట్యూన్ కట్టుకున్న పాటల్ని పాడుతున్నా !

నేనొక మహిళని.

ఒక అమ్మని.

భారత దేశాన్ని దేశమంతా స్తుతించేది భారత్ మాతా కి జై ! అని.

నా అస్తిత్వం గురించి నేనెందుకు దిగులు పడాలి ?

★★★★★ సమాప్తం★★★★★

- బులుసు సరోజినిదేవి

Tags:    
Advertisement

Similar News