పగలు రాత్రి ఒక దాని తర్వాత ఒకటి మానవాళి అందరికీ..
ఆరునెలల ఉత్తరాయణం పగలు. ఆరునెలల దక్షిణాయణం రాత్రి
మన దేవతలు అందరికీ.
దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణం.
అందుకే ఉత్తరాయణం
పవిత్రం అందరికీ,
భాస్కరుని మకర రాశి గమనమే సంక్రాంతి.
అదే మకరసంక్రాంతి
అంపశయ్యపై భీష్ముడు ఎదురుచూసిన కాలం
సాధనకు పనికి వచ్చే పుణ్యకాలం.
మూడు రోజుల పండుగ
ముచ్చటైన పండుగ.
భోగిమంటలతో భోగం.
పాత వస్తువులతో భోగి మంట
కొత్త జీవితానికి స్వాగతం.
ఉపాసన మూర్తులు ఉండేది గుళ్లో.. చలనం లేని బొమ్మలు ఉండేది బొమ్మల కొలువు లో.
బొమ్మలకొలువు పండుగ సాంప్రదాయం.
సాయంత్రం పాపాయి భోగి పళ్ళ పేరంటం.
ఇరుగు పొరుగు దిష్టి
రేగిపళ్లతో దిష్టి,
పెద్దల దినం సంక్రాంతి
పితృ తర్పణం ప్రధానం.
బూరెలు గారెలు జంతికలు
అరిసెలు, అల్లుడు గారి
సంక్రాంతి స్పెషల్.
ఏడాదికోమారు గంగిరెద్దులాటలు బహుమతులకు తల ఊపుతూ గంగిరెద్దుల అభివాదములు.
జాతర మయం అమ్మవారి గుడులు.
అరుగులన్నీ చతుర్ముఖ పారాయణం.
కోడిపుంజుల రణభేరి,
డిన్నర్ కి కోడి పకోడీ.
హరిదాసుల సంకీర్తనలు.
వాకిట్లో గొబ్బెమ్మలు.
వాకిట అంతాగోమయం కళ్ళాపి. ఆకాశమంత ముగ్గులు.
నక్షత్రం లాంటి చుక్కలు.
రైతుకు వ్యవసాయంలో
పశువు సాయం.
కృతజ్ఞతా సూచకం
పశు పూజల కనుమ.
మినప గారెలు
మనకు పరమానందం.
పండుగ శోభ
సాగనంపుతు
రథం ముగ్గులు.
అన్ని కుటుంబాల రథం ముగ్గులు కలుపుకుంటూ పోవడం.
సహజీవనం..
వెరసి పండగ సందడి..
ముక్కనుమ ఊర్ల ప్రయాణం,
అమ్మ కన్నీళ్ల ప్రవాహం.
పల్లె అంతా నిశ్శబ్దం.
రోజులు మారలేదు అవే రోజులు.
మరి పండుగ అంటే
ఎందుకో ఆనందం సంతోషం. పదిమంది కలిసి
ఊరిలో జరిపేదే పండగ.
అమ్మానాన్న ఉంటేనే
అది మన ఊరు.
లేక పోతే మనకు పొరుగు ఊరు..
- MCV సుబ్బారావు