మగధ సామ్రాజ్యం లో మతాబులు వెలిగాయ్
2015 నవంబర్ లో బీహార్ ఎన్నికలప్పుడు ఎన్నికల సర్వే సంస్థలు, బీజేపీ కలిసి ఓడిపోయిన సందర్భంగా వ్రాసిన కవిత
మగధ సామ్రాజ్యం లో మతాబులు వెలిగాయ్
దీపావళి కి మూడ్రోజుల ముందే కాకర పువ్వొత్తులు కళ్ళు జిగేల్మనిపించాయ్
సంతోషం తారాజువ్వలా ఎగిసింది ...
నందులు మళ్ళీ ఓడి పోయారు
పాటలీపుత్రం పర వశం కాలేదని
పరవశించింది
జరుగుతున్నది చాలని
లేనిదేదో కావలనే యావ తనకి లేదని
ఓటు గుద్ది మరీ వక్కాణించింది ,,,
(నేటి) చాణక్యుడు
లోలోపల సంతోషపడుతూనో
పై పై కి బాధ నటిస్తూనో
మొత్తానికి జుట్టు ముడి వేసేశాడు
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
అయినా సరే ... చాణక్యుడు కంప్యూటర్ ప్రొగ్రామింగ్ మీద తోసేశాడు
ఏ జెండా తో కప్పబడిన ఎజెండా వో
మనకి బోధపడదని ...
ఒక వేళ బోధపడినా ...
మనం క్షమించేస్తామనీ ...
లేక బోధపడనట్టూ. మొహాలు పెట్టి నటించేస్తామని
నమ్మకం ..: గాట్టీ నమ్మకం ...
చాణక్యుడి మార్గం నయా చంద్రగుప్తునికీ నచ్చింది
తప్పునాది కాదంటే లోకమొప్పుతుందా ...
ఏం పర్లేదు ... రాముడి భార్య ... నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుందా ...
అంతే ...
అమితాకర్షణ శక్తి
అరుణ వర్ణం పులుముకుంది
జై కొట్టే వాళ్ళూ గడగడలాడించే వాళ్ళూ
తిలా పాపం తలా పిడికెడంటూ
ఓటమి బాధ్యతలకి తిలా తర్పణం చేసేశారు
అఫ్ కోర్స్ ... గుడ్లురిమిన భీష్మ, ద్రొణ, అశ్వత్థామ, విదురులను
ఖండఖండాలుగా ఖండించి పారేసే
కర్ణులూ, శకునులూ...
తాను సుయోధనుడో లేక దుర్యోధనుడో అర్థంకాని స్ప్లిట్ పెర్సనాలిటీ అయిన
రారాజు పంచన
ఉండనే ఉన్నారు ...
తప్పయిందని ఒప్పుకునే
ధైర్యం ప్రణయ్ రాయ్ కున్నంత కూడా లేదని
తమని తాము తీల్చేసుకున్న
తమ పాదాల్లో తామే పేల్చెసుకున్న
సిద్ధంత కేసరులనూ
సిద్ద్గులనూ ... నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే కృపా సర్పాలనూ చూసి ...
మగధ లో మతాబులు వెలిగాయ్
వంగ, చోళ, పల్లవ రాజ్యాల్లోనూ
కొత్త ఆశల ఒత్తులు వెలిగించాయి
పూలు వాడాయి
మాంసం కుళ్ళింది
మతం మసిబారింది
కులం కునారిల్లలేదేమో గానీ
మళ్ళీ మగధ లో
మతాబులు మిరుమిట్లు గొల్పాయ్
గోమాత గోమాయువుల బారి నుంచీ బయటపడింది ... గానీ ...
భయం భయం గానే సుమా ...
పోషించే గోపాలుడు మళ్ళీ
కుడితీ గడ్డీ దాణా ల ధరలు
చుక్కలకెక్కించి ...
మూగ జీవులకి
కూడా చుక్కలు చూపిస్తాడేమో అని ...
చీకటి వెలుగుల రంగేళీ యే ...
రాజకీయుల కంగాళీ యే ...
అయినా ప్రస్తుతానికి
మగధ లో మతాబులు వెలిగాయి
- సాయి శేఖర్