గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం
జల జలమంటూ కళ్ళ వెంట కన్నీరు
మనిషి కళ్ళవెంట చెప్పే
తన భావం కన్నీళ్లు.
ఆనందంతో వచ్చే కన్నీళ్లు
ఆనంద భాష్పాలు.
ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం
కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం.
మనసులో భావం చెప్పే
గొప్ప సంకేతం.
బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు.
పసివాడి భావం కన్నీటితోనే తెలుపు.
మాట వచ్చేవరకూ అమ్మకి
కన్నీటి తోనే సంకేతం ఇచ్చు.
మనసులోని భావo చెప్పడానికే భాష
పసివాడి భాషే కంట వెంట కారే నీరు
బిడ్డకు అమ్మకి మధ్య వారధి కన్నీళ్లు.
బట్ట తడిసింది ఏమో అని అమ్మ గుడ్డలకోసం వెతుకు.
డొక్క చూసి బిడ్డను గుండెలకు హత్తుకొను.
చుక్క గొంతు దిగగానే అమ్మను చూసి బిడ్డ నవ్వు.
ఆ బొమ్మకి తెలుసున్న భాష
కన్నీళ్లే కదా.
మూగ జీవి కన్నీళ్లు
ఆదరించే రైతుకే తెలుసు
లేగదూడ అంబా అనే అరుపుతో పాలికాపు దాని కట్లు విప్పు.
దూడ పొదుగు వెతుకు అమ్మ ఆత్రంగా నాలికతో నాకు.
మూగజీవుల బాధ
బ్లూక్రాస్ వారికే తెలుసు.
ప్రియుడి వెతలు ప్రియురాలికే తెలుసు.
ఎదురుచూపులన్ని కళ్ళ వెంట కన్నీరుగా కారు.
ప్రతి జీవికి కన్నీళ్ల రుచి తెలుసు.
ఉప్పు నీళ్లు అయితేనేం
గుండె బరువు దించు.
మబ్బు పట్టిన మేఘం వర్షమై కురిపించు కన్నీళ్లు.
వర్షం తోటే దేశమంతా సస్యశ్యామలం.
పక్షి మరణం తోటే
ద్రవించింది రుషి మనసు.
కన్నీటి నుంచి పుట్టిందే
రామాయణ మహా కావ్యం.
అత్తింటి కోడలు మౌనంగా కార్చే కన్నీళ్లులో అర్ధాలు ఎన్నో.
అంతరార్ధం
తల్లి మనసుకు మాత్రమే తెలుసు.
జనన మరణాలను
వెంబడించేవి కన్నీళ్లు.
గుండె తడి ఆరేవరకు
నదిలా సాగేవి కన్నీళ్లు.
బిడ్డ పుట్టుకతోనే కన్నీళ్లు పెడతాడు.
ఆ కన్నీళ్ళే బిడ్డ ఉనికికి పునాదిరాళ్లు.
ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయి అంటాడు ఒక కవి.
ఆ కవికి పెడదాం
కన్నీళ్లతో ఒక నమస్కారం.
-మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
(సామర్లకోట)