ఒక లగేజీ కథ

Advertisement
Update:2023-01-04 14:35 IST

వైజాగ్ వెళ్ళడానికి అనకాపల్లి బెల్లం బజార్ దగ్గర నిలబడ్డాడు గురునాథం. వచ్చి చాలా సేపు అయినా ఏ బస్సు రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాంట్లో ఒకవైపు మామిడిపళ్ళ బుట్టలు, మరోవైపు పిట్టల్లా వేలాడుతోన్న ప్రయాణికులు . క్లీనర్ “ వస్తారా ” అన్నాడు తల బయట పెట్టి.

ప్రయాణికుల్ని సమోసాలో బంగాళాదుంప కూరినట్టు కూరాడు , వైజాగ్ వెళ్ళేసరికి ఆ మామిడిపళ్ళలా ముగ్గిపోవడం లేదా కమిలిపోవడం ఖాయం అనుకున్నాడు.

“వద్దు నాయనా బతికుంటే బలుసాకుతో గ్రీన్ టీ తాగవచ్చు ” అన్నాడు . ఇంతలో లారీ వచ్చి ఆగింది . లారీ డ్రైవర్ చెయ్యి ఊపుతూ “ వైజాగ్ ” అన్నాడు . నోట్లోని పాన్పరాగ్ కింద ఊసి. వాడిని చూసి ఒక్కసారే భయపడ్డాడు. ఇంతకుముందు ఆ లారీ ఎక్కాడు . ఒక చేత్తో చెరవాణిలో మాట్లాడుతూ , మరో చేత్తో గుటకా పాకెట్లు స్వాహా చేస్తూ స్టీరింగ్ నియంత్రిస్తూ వాడు తను వైజాగ్ వెళ్ళే వరకూ మరణమృదంగం వినిపించాడు. వాడి లారీ ఎక్కితే యముడు తనను గుటకాయ స్వాహా చెయ్యడం ఖాయం అనుకున్నాడు. ఆ విషయం గుర్తుకువచ్చి చెయ్యి అడ్డంగా ఊపడంతో లారీ వెళ్ళిపోయింది.

గడియారం చూసుకున్నాడు . “ పాఠశాలకు మరీ ఆలస్యం అయ్యేలా ఉంది ” అనుకున్నాడు.

ఇంతలో అతని మిత్రుడు సత్తిపండు వచ్చి “ ఏంటి ఇక్కడ ఉన్నావు ? ” అన్నాడు ఆశ్చర్యంగా ,

“బదిలీలలు ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి. వైజాగ్ బదిలీ అయ్యింది . అనకాపల్లి సొంత ఊరు కదా, అందుకే కిందా మీదా పడుతున్నాను” అన్నాడు.

“అంటే అప్పన్ డౌన్ బావుంది. అచ్చ తెలుగులో మాట్లాడుతావ్ ” అన్నాడు.

“ఔను నా మనవరాలికి తెలుగు నేర్పిద్దామని అలా మాట్లాడుతున్నాను అందరితో, అదే అలవాటు అయిపోయింది” అన్నాడు గురునాథం.

“బావుంది, మరైతే వైజాగ్ వెళ్ళే బస్సులు రావు” అన్నాడు సత్తిపండు.

“ఎందుకూ ? ” అన్నాడు గురునాథం.

“వచ్చినా అరకొరా బస్సులే, బందులు ఆపాలని బంద్ చేస్తున్నారట” అన్నాడు.

అంటే ? ! మళ్ళీ గురునాథం ముఖంలో ప్రశ్నార్థకం . “ఈ మధ్య బందులు ఎక్కువయినాయి, ప్రజా జీవితం స్తంభించింది. అందుకే బందులు ఆపాలంటూ అఖిలపక్షం పిలుపిచ్చింది” అన్నాడు సత్తిపండు నవ్వుతూ , ఆ నవ్వుతో శృతి కలిపాడు గురునాథం.

సరే నీ అదృష్టం పరీక్షించుకో ” అంటూ సత్తిపండు వెళ్ళిపోయాడు .ఇంతలో ఒక బస్సు వచ్చింది. జనాలు పిట్టల్లా వేళాడుతున్నారు. గురునాథం ఆ బస్సు ఎక్కడానికి సాహసించలేదు. తర్వాత మరో పావుగంటకు మరో బస్సు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయింది.

అస్సలే ఎండ, ఆపై ఉక్కపోత… చాలా చికాకుగా ఉంది గురునాథానికి. ఇంతలో మరో బస్సు చాలా దూరం నుంచి వస్తూ కనిపించింది.

“వాడు ఆపడు సార్ , రోజూ ఇదే సమయంలో వస్తుంది ” అన్నాడు పక్కన ఉన్న వ్యక్తి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు . లాల్చీ పైజామా , మెడలో సంచి.

“అంత కరెక్ట్ గా ఎలా చెబుతున్నారు?” అన్నాడు.

“వాడు లగేజీ ప్రియుడు అంటే లగేజీ ఉంటేనే ఆపుతాడు” అన్నాడు ఆ లాల్చీ పెద్దమనిషి .

“నిజమా!” అన్నాడు గురునాథం.

“ఔను… రేపొద్దున వాడి లగేజి మోయడానికి ఆ నలుగురు రారు” అన్నాడు కోపంగా సిగరెట్ వెలిగించి.

“మై గాడ్ ! అంత ఘోరంగా తిడుతున్నారేం , ఒక సామాన్య కండక్టర్ ” అన్నాడు గురునాథం.

ఔను సామాన్యుడే. మనలాంటి సామాన్యులను దోపిడి చేసే అసమాన్యుడు” అన్నాడు సిగరెట్ పొగ రింగులు వదులుతూ.

“మీరు కవిగారా ?” అన్నాడు గురునాథం.

“ఔను ! నా కలం పేరు చేట , చేటలా చెడును చెరిగేసే కవిత్వం రాస్తాను” అన్నాడు.

” మరైతే ఇప్పుడు ఏమిటి దారి ?” అన్నాడు గురునాథం ఆందోళనగా.

“గోదారి” అన్నాడు కవిగారు తాపీగా.

“జోకులు ఆపండి సార్… అసలే కంగారు ” అన్నాడు గురునాథం విసుగ్గా.

“ఔను నేను కరెక్ట్ గానే చెప్పాను . హైదరాబాద్ నుంచి వచ్చే గోదావరి ఎక్స్ ప్రెస్ చాలా లేటట. ఉదయం ఆరింటికి వైజాగ్ వెళ్ళాలి. ఇంకా తునిలోనే ఉంది. మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్తే గోదావరి పట్టుకోవచ్చు” అన్నాడు కవి.

“అదయ్యే పని కాదు, ఈ బస్సును ఆపే మార్గం చూద్దాం” అనుకుంటూ కొంచెం దూరంలో కనిపించిన బస్సుకేసి దృష్టి సారించాడు.

అంతలో పక్కనే తోపుడుబండి మీద ఏవో మూటలు కనిపించాయి.

“బాబాయ్ ! ఆ బస్సు కెదురుగా ఆపు” అన్నాడు రెండు చేతులు జోడించి.

తోపుడుబండి వ్యక్తి విచిత్రంగా చూసి “అర్థమైంది. ఈ కండక్టర్ లగేజీగాడు ” అంటూ తన మూటలున్న తోపుడుబండిని అడ్డంగా పెట్టాడు. టక్కున బస్సు ఆగింది . బతుకు జీవుడా ! అనుకుంటూ గురునాథం, కవి గబగబా బస్సు ఎక్కారు. కండక్టర్ తోపుడుబండి వాడి వైపు చూసి “తొందరగా ఎక్కించు, టైం లేదు ” అన్నాడు. ఆ వ్యక్తి వెక్కిరింపుగా నవ్వి ముందుకు కదిలాడు తన తోపుడుబండితో.

కండక్టర్, గురునాథం వంక కొరకొరా చూసి ” రైట్ . . . రైట్ . . . రైట్ ” అన్నాడు.

బస్సు నిండు గర్భిణిలా భారంగా కదిలింది. పది నిమిషాలు తర్వాత ఇద్దరికి సీట్లు దొరికాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కదలడంతో బయట గాలికి చెమటలు ఆరి హాయిగా అనిపించింది గురునాథానికి. బస్సు మెల్లగా వెళుతోంది.

తర్వాత స్టేజిలో ఇద్దరు రైతులు నిలుచున్నారు గంపలతో, బస్సు ఆపకుండా ముందుకు కదిల్చాడు కండక్టర్, తర్వాత స్టేజి లేకపోయినా ఒక పాతికేళ్ళ అమ్మాయి చెయ్యి ఊపడంతో బస్సు ఆపాడు.

ఆమె గబగబా లోపలకు ఎక్కింది. ఆకుపచ్చ చీర , ఎరుపు జాకెట్టు. ముఖం ఆకర్షణీయంగా ఉంది.

“ బాబోయ్ ! ఈ కండక్టర్ లో ఈ కోణం కూడా ఉందా ” అంటూ కవిత అందుకున్నాడు చేట. “ ఆడమనిషి చెయ్యి ఊపితే బస్సు ఆపేవాడు మగాడు . మగవాడు చెయ్యి ఊపినా బస్సు ఆపేవాడు మంచివాడు” అన్నాడు రాగయుక్తంగా గట్టిగా , ఆ కవిత చెప్పి పకపకా నవ్వాడు కవి.

“ఎందుకు నవ్వుతున్నారు ? ” అన్నాడు గురునాథం.

“ఎందుకైనా మంచిది రేపు బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు సంచిలో చీర వేసుకు రండి ! ” అన్నాడు కవి, నవ్వు మరీ పెంచి. గురునాథం పెద్ద పెట్టున నవ్వాడు . కండక్టర్ ముఖం కందగడ్డలా అయ్యింది, వారి మాటలు విన్నాడు కాబోలు.

బస్సు ముందుకు సాగుతోంది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు, స్తంభాలు వందిమాగదుల్లా స్వాగతం చెబుతున్నాయి. కండక్టర్ తల వంచుకుని కూర్చున్నాడు.

“పాపం ! బాధపడ్డాడేమో మీరు అంత గట్టిగా అనేసరికి ” అన్నాడు గురునాథం.

“బాధపడనీయండి సార్, బాధపడితే గాని బోధపడదు” అన్నాడు కవి. గురునాథం మౌనంగా ఊరుకున్నాడు.

ఇక గురునాథాన్ని , కవిని ఆశ్చర్యంలో పడేసే దృశ్యాలు కనిపించాయి . కండక్టర్ ప్రతి స్టేజిలోనూ బస్సు ఆపుతున్నాడు. లగేజీ ఉన్నా లేకపోయినా, ఆడమనిషి ఆపినా, మగవాడు ఆపినా.

కవిగారు మెల్లగా చెవిలో గొణిగాడు. “కాస్త మార్పు వచ్చినట్టుంది ” అన్నాడు.

“అవును మారినట్టే కనిపిస్తున్నాడు” అన్నాడు.

ఇంతలో గురునాథంకు చిన్నగా నిద్ర వచ్చింది. ఒక కునుకు వేద్దాం అనుకున్నాడు.

“ మరీ ఇంత లేటుగా వెళ్తున్నారు ఎవరూ ఏమీ అడగరా ? ! ” అన్నాడు కవి.

ఏముంది… నేనే బాస్, పైగా గజిటెడ్ హోదా వచ్చింది. ఇంకా ఎవరు నన్ను అడిగేది…” అన్నాడు గురునాథం.

కవి, గురునాథం వంక అనుమానంగా చూసి, “ స్కూలుకు వెళ్ళగానే ఏం చేస్తారు ? ! ” అన్నాడు.

“ఏం చేస్తాను…ఒక టీ తాగుతాను, అటు ఇటు తిరిగి మధ్యాహ్నం భోజనం చేసి ఒక కునుకు తీస్తాను కుర్చీలోనే. సాయంత్రం కాగానే మరో టీ తాగి, అనకాపల్లి బస్సు ఎక్కుతాను” అన్నాడు.

“ఓహో… మీరు డ్యూటీ, సక్రమంగా చేస్తున్నారన్నమాట” అన్నాడు కవి, వ్యంగ్యంగా నవ్వి.

“ఔను… అర్ధమైంది మీరు చమత్కారులే”.

“డ్యూటీ ” చెయ్యడమంటే, రెండు టీలు తాగడమన్నమాట మీ ఉద్దేశం…” అన్నాడు.

” సరే… మీరు విద్యార్థులకు పాఠాలు చెప్పరా ? ! ” అన్నాడు కవి.

“మిగతా మాస్టార్లు ఉన్నారు కదా… వాళ్ళు చెపుతారు. ఇన్నాళ్ళుగా నాకు వ్యవసాయంతో సరిపోయింది . అంచేత పాఠాలు చెప్పడం మర్చిపోయాను…” అన్నాడు గురునాథం.

“మీరు హాలికులు, మిగతా మాస్టర్లు వర్కోహాలికులు” అన్నాడు కవి.

“ఇంకా నయం ఆల్కాహాలికులు అనలేదు” అన్నాడు గురునాథం. కవి నవ్వాడు. ఆ తర్వాత గురునాథం నిమిషం తర్వాత “ ఇంతకీ మీరేం చేస్తారు ? ” అన్నాడు.

“నేనేమీ చెయ్యను. పిత్రార్జితం వుంది. అలాగే నేను రాసిన పుస్తకాలకు ‘రాయల్టీ’ వస్తుంది” అన్నాడు.

“ఒహో ! మీరు ‘ రాయల్ ‘ గా టీ తాగుతారు మాట ! ” అన్నాడు గురునాథం.

“పంచ్ బావుంది ” అంటూ నవ్వాడు కవి. గురునాథం వెంటనే కళ్ళు మూశాడు. సరిగ్గా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చేవరకూ మెళకువ లేదు.

కండక్టర్ ‘ వైజాగ్… వైజాగ్ ‘ అనే కేకలకు కళ్ళు తెరిచాడు. తన పక్కనున్న కవి కనిపించలేదు. వెళ్లిపోయి వుంటాడు అని అనుకున్నాడు. గబగబా కిందకు దిగి నడుస్తుంటే కండక్టర్ పరిగెట్టుకుంటూ వచ్చి “ సార్ మీరు హెడ్ మాస్టర్ కదా, అంటే గెజిటెడ్ ఆఫీసర్ కదా ? ” అన్నాడు.

“అవును ” అన్నాడు గురునాథం ప్రశ్నార్థకంగా చూసి.

“సర్, నేను ప్రమోషన్ పరీక్షలకు వెళ్తున్నాను. గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్ కావాలి” అన్నాడు వినయంగా, ఆ మాటలకు గురునాథం ఆలోచనలో పడ్డాడు.

“క్షమించండి. మీకేమైనా ఇబ్బంది కలిగించానా? ” అన్నాడు.

“సరే చూద్దాం మా పాఠశాలకు రండి , మాధవధారలో ఉంది” అంటూ ముందుకు కదిలాడు.

నడుస్తున్న గురునాథం ఆలోచనలో పడ్డాడు. కండక్టర్ కు కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ వ్యక్తి కాస్త మారినట్టే కనిపించాడు . మరి తన సంగతి! ఎవరో చెంప మీద ఛెళ్లున కొట్టినట్టయ్యింది గురునాథానికి. తను ఇన్నేళ్ళు ఉద్యోగం సక్రమంగా చేశాడా… సొంత పనులు, వ్యవసాయం. తను కండక్టర్‌కు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత కలిగి ఉన్నాడా! ఔను అతగాడికి అది ఇవ్వాలంటే తను, తన కాండక్ట్ సక్రమంగా మారాలి. అంతే…

అలా తనలోని గురుడు దారి చూపుతుండగా ముందుకు కదిలాడు గురునాథం. మనస్సులో ఉవ్వెత్తు ఆలోచనలతో గురునాథం స్కూలుకు చేరుకున్నాడు . టైం పదిన్నర , అప్పటికే ప్రార్ధన ముగిసింది. స్కూలు గేట్లు మూసేశారు. బయట డ్రిల్లు మాస్టర్ బెత్తంతో నుంచున్నాడు. ఆలస్యంగా వచ్చిన పిల్లలకు శిక్ష వేసి లోపలకు పంపుతున్నాడు . శిక్ష అంటే రెండు బెత్తం దెబ్బలు లేదా ఇరవై గుంజీలు.

గురునాథాన్ని చూసి “సార్ ! నమస్కారం” అన్నాడు. అప్పుడే లేటుగా వచ్చిన ఒక కుర్రాడి చేతి మీద బెత్తంతో కొట్టాడు. ఆ కుర్రాడు కళ్లు తుడుచుకుంటూ లోపలికి పరిగెత్తాడు.

గురునాథానికి చాలా గిల్టీగా అనిపించింది. కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వమన్న కండెక్టర్ గుర్తుకువచ్చాడు. వెంటనే డ్రిల్ మాస్టారి ముందు చెయ్యి చాపాడు, బెత్తంతో కొట్టమన్నట్టుగా.

డ్రిల్లు మాస్టారు అర్థం కాక “ఏం కావాలి సార్…?” అన్నాడు.

“శిక్ష… నేనూ స్కూలుకు లేటయ్యాను, నాకు శిక్ష పడాలి ” అన్నాడు . ఆ మాటలకు డ్రిల్ మాస్టారు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.

“సరే మీకు కొట్టడం ఇబ్బందిగా ఉన్నట్టుంది, గుంజీలు తీస్తాను” అంటూ వంగాడు మెల్లగా. ఆయాసం వచ్చినా గుంజీలు తీయడం మానలేదు గురునాథం. ఆ దృశ్యాన్ని అంతా చూశారు. విద్యార్థులు కిటికీలోనుంచి చూశారు. పాఠం చెబుతోన్న టీచర్లు పాఠం ఆపి మరీ చూశారు.

గుంజీలు తీసిన గురునాథానికి ఆయాసం అనిపించలేదు, ఆనందం కలిగింది. చాలా సంవత్సరాల తర్వాత, తను సక్రమంగా డ్యూటీ చేశాడనిపించింది. తనకు ఇప్పుడు ఆ కండక్టర్ కు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత కలిగింది అనిపించింది. ఆ ఉత్సాహంతో విద్యార్ధులకు చాలా కాలం తర్వాత పాఠం చెప్పడానికి బయలుదేరాడు గురునాథం.

రెండు మూడు నెలల తర్వాత – వైజాగ్ వెళ్ళాడు గురునాథం. మనవరాలి పుట్టినరోజుకు బట్టలు కొందామని. బస్ కాంప్లెక్స్ లో బస్సు దిగి నడుస్తున్నాడు. ఇంతలో ఒక కారొచ్చి ఆగింది.

ఒక వ్యక్తి తల బైట పెట్టి – “సార్ నమస్కారం!” అన్నాడు.

“ఎవరూ?” అని ప్రశ్నార్థకంగా చూసాడు గురునాథం.

“నేనే సార్, కండక్టర్ ని. నాకు కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు కదా !” అన్నాడు.

“ఓహ్… నువ్వా… బావుంది. ఎలా వున్నారు?” అన్నాడు.

“నాకు ప్రమోషన్ వచ్చింది . కండక్టర్ నుండి డిపో క్లర్క్ గా అయ్యాను. ఫేస్ క్రింద ఉద్యోగం. పిల్లలు గొడవ పెడుతున్నారని సెకెండ్ హేండ్ కారు కొన్నాను. రండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో చెప్పండి దించుతాను” అన్నాడు.

“సరే, అలా జగదాంబ వైపు ” అన్నాడు కారులో కూర్చుంటూ గురునాథం. కారు ముందుకు కదిలింది. కండక్టర్ చెప్పుకు పోతున్నాడు. సార్, ఆరోజు మీరు నాకు బస్సులో కలవడంతోటే నేను మారిపోయాను. డ్యూటీలోని బ్యూటీ ఏంటో అర్థమైంది” అన్నాడు. ఆ మాటలకు నేను కూడా మారాను అనుకున్నాడు మనసులో గురునాథం.

ఇంతలో సడన్ బ్రేక్ తో కారు ఆగింది. “ఏమైంది?” అన్నాడు గురునాథం కంగారుగా.

ఎదురుగా ఒక తోపుడుబండి, దాని మీద మూటలు. వాడిని చూసి ఇద్దరికీ నవ్వొచ్చింది.

“ఏంటి సార్, లగేజీ కనబడగానే బస్సు ఆగేది. ఇప్పుడు కారులో వెళుతున్న లగేజీతో కారు ఆగిపోతోంది” అన్నాడు నవ్వుతూ.

“అంటే నీకు లగేజీ మీద వ్యా మోహం పోవడం లేదన్నమాట. నాకూ అది ఒక పాఠం చెప్పాలనుకుంటుందేమో ! ” అన్నాడు గురునాథం, చిన్నగా నవ్వి.

“ఏం పాఠం సార్ ? ” అన్నాడు కండక్టర్ కారు ముందుకు పోనిస్తూ.

“మనం ప్రయాణంలో లగేజీ తీసుకువెళతాము. అయితే అంతిమ ప్రయాణంలో ఏ లగేజీ మన వెంట రాదు. మనం వట్టి చేతులతోనే వెళ్ళాలి. అదే మనం నేర్చుకోవలసింది. అలా మన లగేజీ మన అంతిమ క్షణంలో మోయడానికి మనం ఆ నలుగురిని సంపాదించుకోవాలంటే, మనం మన డ్యూటీ సక్రమంగా చెయ్యాలి – అదే ఈ ‘లగేజీ’ కథ ” అన్నాడు గురునాథం.

“బావుంది సార్, లగేజీ వెనక వేదాంతం” అంటూ కారు ముందుకు వేగంగా కదిలించాడు కండక్టర్.

- ఎమ్.సుగుణ రావు

Tags:    
Advertisement

Similar News