ఇంత విస్తృత వాస్తవ ప్రపంచమూ
కనుగుడ్డు లోపలే కనిపించేంతగా కుదించుకుపోతే
సమస్త విజ్ఞానశాస్త్రావిష్కరణలకు
ఉత్తేజితమై మనసు ప్రణమిల్లుతోంది
మతమొక చికిత్సకందని జాడ్యమై
అనేకుల్లోంచి అనేకుల్లోకి ప్రవహిస్తూ
మదమెక్కిన మెదళ్ళలోకి చేరుతూంటే
మతబోధనల సారమెరిగిన
రోగరహిత దేహకణాలన్నీ
వణుకుతూ శాంతి జపం చేస్తున్నాయి
ఆయుధాలకు కళ్ళుండవు
ప్రయోగించే కళ్ళకు రక్తకాసారాలే కనువిందు
భూమధ్యరేఖ రెండుకొసళ్ళనూ కలుపుతూ
ఎగిరిన తెల్లపావురం క్షేమంగా తిరిగొస్తుందనుకుంటే
ఏ దారుణ ఆయుధాఘాతానికి బలైందో
ప్రపంచమంతా వెతికినా
కాపాడే గౌతముడే కానరాలేదు
కవిత్వం ముంగిట్లో నెత్తుటిముద్దగా వాలింది
ఆకలితో కాలే పేగుల సెగ ఎవరికి తగిలేను
నెగడు రాజ్య సౌధాల దాకా రానేలేదుగా
మత గ్రంథాల శాంతి ప్రవచనం వ్యర్థాలాపన
ఇది ఆయుధపోటి ప్రపంచం అంటుంది యుద్ధకాంక్ష
అయినా మన స్వరం ప్రతిధ్వనించాల్సిందే
వృథాగా పారుతున్న రక్తం విలువ గానం చెయ్యాల్సిందే
ప్రపంచమంతా శాంతి సిద్ధాంతంమీద నడవాల్సిందే
తెల్లపావురం ఎగరెయ్యాల్సిందే
నేడో రేపో సరికొత్త ప్రపంచానికి పురుడు పొయ్యాల్సిందే
- కొంపెల్ల కామేశ్వరరావు