లక్ష్యం (కథ)

Advertisement
Update:2023-04-09 16:45 IST

చిన్నారావు అలసిపోయి ఇంటికి వచ్చాడు . ఇంట్లో భార్యా కూతురి మధ్యలో ఘర్షణ జరుగుతోంది . ఇద్దరూ ఏదో విషయంలోవాదించుకుంటున్నారు . అతనికి ఆ ఘర్షణలో పాలు పంచు కోవాలని లేదు . కూతురు జమున తన వాదాన్ని బలపర్చుకోలాలని ఏదేదో చెబుతోంది . భార్య సుమిత్ర ససేమిరా అంటోంది . అసలు ఏ విషయంలో వాళ్ళు వాదించుకుంటున్నారో అర్ధం కాలేదు చిన్నారావుకి .

" అబ్బా ! చాలా చిరాగ్గా ఉంది నాకు . ఎప్పుడూ ఇద్ధరూ ఎందుకు వాదులాడుకుంటారు ? " చిన్నారావు గొంతు వినగానే తల్లీ కూతుళ్ళిద్దరూ ' నువ్వెప్పుడొచ్చావు ? " అన్నట్టు చూసారు .

" ఇంతకీ ఏంటి మీ సమస్య " అడిగాడు చిన్నారావు .

" చూడు నాన్నా ! నేను ఐ ఎ ఎస్ చేస్తాను అంటే , నీ వల్ల కాదు చదువిన డిగ్రీ చాలు అంటోంది " ఫిర్యాదు చేసింది జమున .

" ఐ ఎ ఎస్ అంటేమాటలనుకుంటోంది . మీరైనా గట్టిగా చెప్పండి దానికి " వెంటనే అంది సుమిత్ర .

" సుమిత్రా ! ఇప్పుడు చెప్పేటంత ఓపిక నాకు లేదు గానీ , ఆకలిగా ఉంది అన్నం పెట్టు " అంటూ ఫ్రెష్ అయి రావడానికి బాత్రూం లోకి నడిచాడు చిన్నారావు .

అక్కడితో ఆ వాదానికి పులి స్టాఫ్ పడింది .మర్నాడు ఆదివారం డ్యూటీ లేకపోయినా తయారవుతున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది సుమిత్ర .

" ఈరోజు ఆదివారం . రానురాను మతిమరుపు పెరుగుతోంది మీకు . కొంచెం రైతు బజారుకెళ్లి కూరగాయలు తీసుకురండి " అంది సుమిత్ర చేతి సంచి ఇస్తూ .

" నేను వెళ్ళేది చాలా ముఖ్యమైన పనిమీద . అమ్మాయిని రమ్మను " అన్నాడు చిన్నారావు . అప్పటికే రెడీ అయి ఉన్న జమున తండ్రి ముందు నిలబడింది .

" నాన్న నన్ను ఓ చోటికి తీసుకెళ్తానని రాత్రే చెప్పాడు . బై అమ్మా ! " అంటూ స్కూటీ దగ్గరకు నడిచింది జమున .

" ఏంటో ఈ మధ్య తండ్రీ కూతుళ్ళు నా దగ్గర చాలా దాస్తున్నారు " అంది సుమిత్ర .

చిన్నారావు కూతుర్ని తీసుకుని బయలుదేరాడు . కలెక్టర్ గారి బంగ్లా ముందు స్కూటీ ఆపి " దిగు " అన్నాడు .

" ఇక్కడికి తీసుకొచ్చావేంటి నాన్నా ! " అయోమయంగా అడిగింది జమున .

" మా సార్ నీతో మాట్లాడతారంట రా " అంటూ వాచ్ మెన్ తో విషయం చెప్పి కూతురితో పాటు లోపలికి నడిచాడు .

కలెక్టర్ విజయేంద్రప్రసాద్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు . చిన్నారావు తో పాటు జమున కూడా నమస్తే చెప్పింది .

" చెప్పు చిన్నారావ్ ! ఏదో సమస్య అన్నావు " జమునని గమనిస్తూ అడిగాడు .

" అదే సార్ ! మా అమ్మాయి జమున ...మీలాగే ఐ ఏ ఎస్ చదువుతానంటోంది "

" గుడ్ మంచిదేగా ...అది సమస్య ఎలా అవుతుంది "

" మా కుటుంబం గురించి , నా ఆదాయం గురించీ మీకు తెలుసు కదా సార్ ! ఈ పరిస్థితుల్లో తనని డిగ్రీ చదివించడమే కష్టం అయ్యింది నాకు. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ చదువంటే ఎంత కష్టమో మీరే చెప్పండి . మా అమ్మాయికి నచ్చజెబుతారని తీసుకొచ్చాను " చెప్పాడు చిన్నారావు . అప్పటికే జమున కళ్ళు నీళ్ళు నిండటం చూసాడు విజయేంద్రప్రసాద్ .

" ఐ ఎ ఎస్ అంటే ఏదో మేకప్ అయి కాలేజీకి వెళ్ళి రావడం అనుకున్నావా ? చాలా కష్టం . రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో పద్దెనిమిది గంటలు చదువు మీదే దృష్టి సారించాలి . చాలా కోల్పోవాల్సి ఉంటుంది . పైగా మీ నాన్న ఇబ్బంది పడుతున్నాడు కదా ? ఆయన మాటల్ని గౌరవించొచ్చుకదా ? " ఆయన మాటలు పూర్తిగా వింది జమున .

" సార్ ! టెన్త్ లో , ఇంటర్లో , డిగ్రీలో జిల్లాలో టాపర్ని నేను . ఐ ఎ ఎస్ చదవాలనేది నా కల సార్ ! నేను జాబ్ చేస్తూ చదువుకోగలను . మా నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు . కానీ ఆయన కూతురిగా నేను ఆయన్ని హేపీగా చూడాలని ఆశ పడుతున్నాను . నేను ఆర్గ్యు చేసానని తప్పుగా అనుకోకండి . మా లాంటి అమ్మాయిల్ని ప్రోత్సాహించండి . నేను తప్పకుండా ఐ ఎ ఎస్ చదవాలి సార్ " ఎలాంటి ఉద్రేకం లేకుండా చెప్పింది జమున .

" తను అంత కాన్ఫ్ డెంట్ గా ఉండగా నీకేంటి భయం చిన్నారావ్ ? " నవ్వాడు విజయేంద్రప్రసాద్ .

" అదే సార్ ! ఊళ్ళో ఉన్న అమ్మావాళ్ళని నేనే చూడాలి . ఆర్థిక ఇబ్బందులు ...ఈ పరిస్థితుల్లో ఇంత భారం ఓ మామూలు డ్రైవర్ గా నేను మోయలేను సార్ ! " దిగులుగా అన్నాడు చిన్నారావు .

" ఓ పని చెయ్యి ...రేపు రాత్రి జమునని బంగ్లా కి పంపించు "

తను సరిగ్గానే విన్నానా అన్నట్టు చూసాడు చిన్నారావు .

" నా మిసెస్ కూడా ఊరెళ్ళింది . ఏంటి పంపిస్తావా ? అన్నీ నేను చూసుకుంటాను " కుర్చీలోంచి లేస్తూ అన్నాడు విజయేంద్రప్రసాద్ .

జమునతో పాటు బైటికి వచ్చాడు చిన్నారావు . అతని మనస్సు అవమానంతో కుతకుత లాడిపోతోంది . చేతిలో ఆయుధం లేదు గానీ , కలెక్టర్ని చంపేసి జైలుకెళ్ళాలన్నంత కోపం వచ్చింది . కూతురి మొహం వైపు చూడాలంటేనే ఏదోలా ఉంది . నాలుగు మంచి మాటలు చెప్తాడని తీసుకొస్తే ఏకంగా జముననే బంగ్లా కి

పంపమంటాడా ?

" నాన్నా ఇల్లొచ్చేసింది ఆపు " జమున హెచ్చరించే సరికి ఈలోకంలోకి వచ్చాడు . భార్య విషయం అడుగుతుంటే కోపంగా అరిచి , సంచీ తీసుకుని రైతుబజారుకి బయలుదేరాడు .

మర్నాడు డ్యూటీ పూర్తయి వస్తుండగా జమునని పంపిస్తున్నావా ? అనడిగేడు విజయేంద్రప్రసాద్ . చిన్నారావు ఏ అర్ధం లేనట్టు తలూపాడు .

ఆరాత్రి చాలా సేపు ఆలోచిస్తూ పడుకున్నాడు .

" మీరు వెళ్ళలేదా అమ్మాయితో ...కలెక్టరు గారి బంగ్లాకి వెళుతున్నానని జమున చెప్పింది " అంటూ వచ్చింది సుమిత్ర .

చిన్నారావు గుండె ఆగిపోయినట్టు అయి గిలగిల్లాడాడు . ఉన్నపళంగా బయలుదేరాడు . ఎంత అన్యాయం ? కంచే చేను మేస్తే తనని కాపాడేవాళ్ళెవరు ? ఆటో ఎక్కాల్సిన ఆలోచన కూడా రాలేదు . పరుగెత్తుతున్నాడు .

బంగ్లా ముందున్న వాచ్ మేన్ అతన్ని లోపలికి పంపడానికి ఇష్టపడలేదు .

" కలెక్టర్ గారు ఎవర్నీ లోపలికి పంపొద్దన్నారు " అంటూ గన్ అడ్డుపెట్టాడు .

" లోపల నా కూతురుందన్నా ! నీకాళ్ళు పట్టుకుంటాను నన్ను వెళ్ళనీ " అంటూన్న చిన్నారావు పి చూస్తే ఏమనుకున్నాడో " సరే పద అంటూ లోపలికి తీసుకెళ్ళాడు వాచ్ మేన్ .

లోపల దృశ్యాన్ని చూసి , అక్కడ గొయ్యి ఏర్పడి తాను అందులో సమాధి అయిపోతే బాగుండుననిపించింది . నిలబడలేనట్టు వాచ్ మేన్ చేతిని

ఆసరాగా పట్టుకున్నాడు చిన్నారావు .

లోపల జమునతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు . వాళ్ళు ఎదురుగా విజయేంద్రప్రసాద్ కూర్చున్నాడు . అసలు ఐ ఎ ఎస్ అంటే ఏంటి ? ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఎలాంటి బుక్స్ చదవాలి ? లాంటి విషయాలు చెబుతుంటే , జమున మిగిలిన అమ్మాయిలు తలలూపుతూ నోట్ చేసుకుంటున్నారు . తనే మెటీరియల్ బుక్స్ తెప్పించి ఇస్తానని , డౌట్స్ ఉంటే తనని కాంటాక్ట్ చెయ్యొచ్చనీ చెబుతున్నాడు . తనకి ఇవ్వాల్సిన గురుదక్షిణ మీరు సెలెక్ట్ కావడమే అంటున్నాడు .

కాస్సేపటి తర్వాత బైటికి వచ్చిన విజయేంద్రప్రసాద్ చిన్నారావుని చూసి నవ్వేడు .

" ఈ విషయాలు నిన్ననే చెప్పొచ్చు చిన్నారావ్ ! కానీ తన ఇంట్రెస్ట్ , ధైర్యం ఏ పాటిదో తెలుసుకోవాలని చిన్న టెస్ట్ . మీ అమ్మాయి గెలిచింది . తను గ్రూప్స్ కి ప్రిపేర్ అవనీ ...అంతా నేను చూసుకుంటాను . తను తప్పకుండా కలెక్టర్ అవుతుంది "

అప్పటికే చిన్నారావు కన్నీళ్ళు విజయేంద్రప్రసాద్ కాళ్ళని అభిషేకిస్తున్నాయి . అర్ధం కానట్టు చూస్తున్నాడు వాచ్ మేన్ .

జమున తండ్రి చేయి అందుకుని ముందుకు సాగిపోయింది తనదైన లక్ష్యం వైపుకి *

- జాస్తి రమాదేవి

Tags:    
Advertisement

Similar News