ఇంద్ర ధనుస్సు (కథానిక)

Advertisement
Update:2022-12-05 13:12 IST

ఇంద్ర ధనుస్సు (కథానిక)

కవిత కిటికీ లోంచి బయటకి చూసింది. వాన మందగించింది. చిక్కటిమేఘాలు పరుగెత్తుతున్నాయి. మరోవైపు సూర్యోదయం, మధ్యలో ఇంద్రధనస్సు. కళ్ళకు భలే ఆహ్లాదంగా ఉంది. ఫోన్ లో కెమేరాతో ఒక ఫొటో తీసింది.

ఈ లోపు వాట్సాప్ లో మెస్సేజ్ వచ్చిం దిరాధిక నించి, "హ్యాప్పీ కెనడా డే కవితా" అంటూ, రాధిక ప్రొఫైల్ పిక్ చూసింది కవిత. -వీ ఆర్ ఫుల్లీ వాక్సి నేటెడ్ ఫర్ కోవిడ్ 19 - అన్న బ్యానర్ ముం దు నిలబడి ఆరుగురు అందమైన స్త్రీలు తీయించుకున్న ఫొటో. అలా కన్నార్పకుండా చూస్తూ.. "అయాం వెరీ హ్యాప్పీ ఫర్ యూ రాధికా" అనుకుంది.

కవితా, రాధికా బాల్య స్నేహితులు, ఒకే స్కూ ల్ లో చదువుకుని దూరమయి, మళ్ళీ అనుకోకుండా లండన్, ఆంటారియో, కెనడాలో కలిసారు.పదేళ్ళ క్రితం రాధిక భర్త చనిపోవడంతో, తను శక్తి కోల్పోయి నిస్సహాయస్థితిలో ఉన్న రోజుల్లో కవిత ఎక్కు వగా రాధికతోనే గడిపేది. రోజు వారీగాపరామర్శకు వచ్చే అనేక మంది సందర్శకులు, సలహాలూ, సూచనలూ, కర్మప్రవచనాలు. అందులో ఒకటైనా రాధిక నైరాశ్యం పోగొడతాయని ఆశించిన కవితకి ఆశాభంగమే అయ్యింది.

ఒక రోజున రోస్ మేరీ వస్తానని ఫోన్ చేసింది. ఆ అమ్మాయి రాధిక భర్తకి సేవ చేయడానికి వచ్చే నర్సు. కవితకి ఆవిడ మీద సదభిప్రాయం లేదు.భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయం పట్ల అవగాహన ఉన్నట్టు లేదు పైగా కొంచెం దూకుడు మనిషి కూడా. గత నెలలో ఒకసారి రాధిక వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రాధిక భర్తకి ఇంజెక్షన్ చేస్తూ కనబడింది. అప్పుడే నచ్చలేదు కవితకి.

మరుసటి రోజు వస్తూనే బిగ్గరగా "హాయ్, రాధికా మైహనీ! హౌఆర్ యు? ఎందుకు చీకట్లో కూచున్నావు" అంటూ, చనువుగా కర్టెన్లు పక్కకి తొలగిం చి, ఒక సువాసన వచ్చే కొవ్వొత్తిని వెలిగించిం ది. చేతులు కడుక్కు ని, ఫ్రిజ్ లోంచి జ్యూస్ తీసి మూడు కప్పుల్లో పోసి, తనొకటి తీసుకుని, కవితకీ, రాధికకీ అందించింది. కవిత ఆశ్చర్యపోయింది. రాధిక తన ప్రాణప్రదమైన చిన్న నాటి నేస్తమైనా తను అంత చనువుగా కావలసినవి తీసుకుని తినడమూ తాగడమూ చెయ్యలేదు ఎప్పుడూ.

రాధిక భర్తకి సేవ చెయ్యడానికి వచ్చినప్పుడు అతనికి మందులు వేసేటప్పుడో, ఇంజెక్షన్లు తీసుకునేటప్పుడో ఫ్రిడ్జ్ తీయడం అలవాటుఅయి ఉండవచ్చు గాక! అయినా ఈ రోజు అంత చనువు ప్రదర్శించడం కవితకి మింగుడు పడలేదు.

నెమ్మదిగా రాధిక పక్కన కూర్చుని, తన తల మీద రాస్తూ, "రాధికా, మై హనీ, నీ లాగా నేను చదువుకోలేదు, కానీ నేను చెప్పేది విను. జీవితం క్లిష్టమైనది,ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికీ సహజం, జీవితం ఇచ్చే ఛాలెం జీలని మనము ఆమోదించాలి, యుద్ధం చేయాలి. చూడు !ఎప్పుడూ తల వంచుకుని కూర్చోవద్దు,తప్పు చేసిన దానిలాగా ఎందుకలా? అన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం ముఖ్యం .నీవు ఆరోగ్యంగా ఉంటేనే కదా సరైన నిర్ణయాలు తీసుకునే స్థైర్యం వస్తుంది?

నీ భర్త పోయినందుకు, అతని బాధ్యత కూడా నీదే ఇప్పుడు. నీ జీవిత లక్ష్యం నీ పిల్లలు. అది అర్థం చేసుకో. అందరూ మరణిస్తాము ఎప్పుడో ఒకప్పుడు. జీవించి బాధ్యతలని సరిగ్గా నిర్వర్తించడమంటే జీవితాన్ని గెలిచినట్టు" అంది.

రాధిక వెక్కి వెక్కి ఏడుస్తోంది.

"రాధికా నీకు నా గతం గురిం చి చెప్పలేదు కదూ. నా భర్త సౌత్

ఆఫ్రికాలో ఉన్నాడని, చాలా మంచి వాడనీ చెప్పాను కదూ. నేను నా ఐదుగురు పిల్లలతో ఒంటరిగా ఎందుకు ఉంటున్నానని అడిగితే దాటవేసాను కదూ?

ఇప్పుడు చెబుతా విను. నా భర్త నన్ను చాలా హింసిం చేవాడు. పిల్లలతో ఇలాఅని నేను భరిస్తూ ఉండిపోయాను, కానీ అతని పైశాచికత్వం తట్టుకోవడం నా

వల్ల కాలేదు. స్కూ లుకెళ్ళిన పిల్లలని తీసుకొచ్చే నెపంతో చంటి బిడ్డలని స్ట్రోలర్ లో వేసుకుని, స్కూ ల్ నించి పిల్లలని తీసుకుని బస్సెక్కేసాను.

ఏ ఆధారమూ లేదు. కూలీ నాలీ,

ఏ పని ఎదురొస్తే అది చేసుకున్నాను. కొందరిని నమ్మి మోసపోయాను

కానీ నాకు తప్పదు అంతే. దేవుని దయవలన ఒక చర్చి వాళ్ళ

సహాయంతో ఇక్కడికొచ్చి పడ్డాను పిల్లలతో సహా.

వచ్చినప్పుడు నాకు చదువులేదు, డబ్బు లేదు, ఏమీ తెలియదు. పిల్లలని సాకాలి అదొక్కటే ధ్యేయము. పెద్దపోరాటమే, అదే జీవితం మొత్తం పోరాటమే, కానీ మంచి, చెడు సమానంగా స్వాగతించాను. నా బిడ్డల కళ్ళల్లోనూ, నా చుట్టూ ఉన్నవారి కళ్ళల్లోనూ వెలుగు

నింపే ప్రయత్నం చేసాను. పని చేస్తూ, పిల్లలని చూసుకుంటూ చదువుకున్నాను.

నెమ్మది నెమ్మదిగా ఒక ఆస్పత్రిలో క్లీనింగ్ కి కుదిరాను. అక్కడ వాళ్ళతో

మాట్లాడుతూ, చిన్న చిన్న కోర్సులు చేసాను. అలా అలా రిజిష్టర్డు నర్స్ అయ్యాను.నువ్వు నాలాగా కాదు, నీకు చదువు ఉంది, కాస్తో కూస్తో ఆధారం ఉంది. నువ్వునిర్లిప్తం గా ఉండడంలో అర్థం లేదు. లే !

ముందు జరగబోయేది చూడు" అంది.

కవిత కి క్రమంగా రోస్ మేరీ మీద దురభిప్రాయం పోసాగింది.

"నువ్వు నిజంగా గ్రేట్, ఎలా సాధిం చావో ఇవన్నీ" అంది మనస్పూర్తిగా.

"ఏంచేస్తాం డార్లింగ్, ఇవి నాకు నా భర్త ఇచ్చిన ఆస్తులు ఇవిగో" అంటూ షర్ట్ఎత్తి, పొట్టమీద ఉన్న కత్తితో కోసిన గాయాలు చూపించింది రోస్ మేరీ. కవితచలించి పోయింది. రాధిక అవాక్కయింది.

"మై డియర్ ఫ్రెండ్, దయచేసి నీ

దినచర్య ప్రారంభించు, నీ ఆరోగ్యం , నీ పిల్లల మీద దృష్టి, ఏకాగ్రతతో నీ జీవితలక్ష్య సాధన చేయి" అంటూ రాధిక చెయ్యి పట్టుకుం ది రోస్ మేరీ.

రాధిక కళ్లు అమాంతం వర్షించాయి మళ్ళీ. ఇవి తన భర్త తాలూకు అనిపించలేదెందుకో,

రోస్ మేరీ కథ వల్ల వర్షిం చిన మేఘాలు కవిత కళ్ళలాగే!

చాలా సేపు మాట్లాడాక

వెళ్ళబోతూ, ఫ్రిడ్జ్ మీద ఒక అయస్కాంతంతో కూడిన స్టికర్ అంటించింది రోస్ మేరీ. దాని మీద "రెయిన్ బో విత్ లైఫ్ ఈస్ కలర్ ఫుల్'' అని వ్రాసి ఉంది.

మరునాడు రాధిక ఇంటికి వెళ్ళి నప్పుడు, తను లేచి పనులు చేసు

కుంటోంది. ప్రశాంతంగా లోపలికి ఆహ్వానించడం చూసి కవిత తెగ సంతోషపడింది. రోస్ మేరీ చెప్పిన విషయాలకి రాధికలో వచ్చిన మార్పు చూసి, రోస్ మేరీ కి ధన్యవాదాలు తెలుపుకుంది మనసులో.

ఇప్పటికి పదేళ్ళు గడిచాయి.

రాధిక పిల్లలు, రాధికా కూడా ఆర్ధికం గా ఆరోగ్యం గా అన్ని విషయాల్లోనూ

ఎదిగారు. రోస్ మేరీ ఎంత శక్తివంతమైనది, సరళమైన భాషలో హిత బోధ చేసింది.

అప్పటికి రాధికని చాలా మంది నిరుత్సాహపరచారు. కర్మ శాస్త్రమనీ,

పూర్వజన్మ పాపకారణం వల్ల అన్నీ ఇలా జరిగాయనీ, కూతురుకి సంవత్సరం లోపు వివాహం చేస్తే తండ్రి ఆత్మ శాంతిస్తుందనీ, కొడుకుని ఎట్లా పెంచుతుందో

అనీ అనేక సానుభూతి వాక్యాలు సలహాలు.

"రోస్ మేరీ నిన్నేదో మాయ చేసిందే" అంటుండేది కవిత రాధికతో.

"అవును కవితా, నువ్వు నాకు ఆత్మవైతే, తను మార్గదర్శకం చేసిన గురువు,కురుక్షేత్రం లో అర్జునుడికి కృష్ణభగవానుడు చేసిన బోధన లాంటిది" అంటూనవ్వేది రాధిక.

ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు తోడు లేకపోయినా కెనడాయే మంచిది అంటుంది రాధిక. రోస్ మేరీ చెప్పినట్టు మనసు ఉంటే, మార్గం ఉంటుంది.కెనడాలో కనబడని అందం ఉంది. మంచు తెరల నైరాశ్యం వెనక ఇంద్రధనస్సు

రంగులున్నాయి. అన్ని రంగులు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని మతాలు,అన్ని లింగాలూ, కలిసి తెచ్చిన ఇంధ్ర ధనస్సు అది. రోజూ కొత్తవి నేర్చుకోవడానికి

మాత్రమే ఉదయం అవుతుం ది అంటుంది రాధిక.

"కవితా ఒక శోకం నించి శ్లోకం పుట్టి, మహా గ్రంథమయింది, నా

దుః ఖం లోంచి రోస్ మేరీ వాక్కు పుట్టి, నా జీవితానికి దారి అయింది, ఐ విల్ డై వితవుట్ రెగ్రెట్స్"

అంటుంది రాధిక.

అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి, రాధికకి ఫోన్ కలిపింది కవిత.

-గన్నవరపు లక్ష్మి, (లండన్, కెనడా)

Tags:    
Advertisement

Similar News