అప్పుడప్పుడూ
అరచేతుల్ని ముద్దాడుకోవాలి
వేలికొసలతో అరచేయి మాట్లాడే
సుతిమెత్తని భాషను ప్రేమించాలి.
మంచికి సెల్యూట్ చేసిన
ఈ అరచేతిని
చెడుకు చెంపవాయించిన
ఈ అరచేతిని
అప్పుడప్పుడూ కళ్ళకద్దుకొని గర్వపడాలి
అరచేతిని తెల్లకాగితం చేసి
అమ్మపేరో, ఆకలిగీతమో రాసుకోవాలి
చెట్టుబొమ్మనో, చేను గట్టునో గీసుకోవాలి
కనీసం తెలుగు అక్షరాలైనా రాసి
అమ్మభాషను బతికించుకోవాలి
అరచేతిని ఆకాశం చేసి
గోరింటాకుతో వెన్నముద్దలు పెట్టి
పండుగపూట చందమామను అతిథిగ పిల్చి
కనులకొలనులో ఆనందాల కలువలనుపూయించాలి
అరచేతిని పుస్తకంగా చదువుతూ
విడిపోని రేఖల్లా
అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి
అరచేతిని తాకడమంటే
బాల్యాన్ని ఎత్తుకోవడమే!
అరచేతిని ముద్దాడడమంటే
పసిమనసుతో జీవించడమే!!
మన జీవితాన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడడమే!!
ఆత్మీయులు నిను వీడలేక
మళ్ళీ మళ్ళీ నీవైపే చూస్తున్నప్పుడు
ఓ సారి వాళ్ళ అరచేతిని ముద్దాడిచూడు...
ఒకరి అరచేతిని ముద్దాడడమంటే
అనుబంధాలను అల్లుకోవడమే!
- తగుళ్ల గోపాల్