గుండ్రని చతురస్రం

Advertisement
Update:2022-12-22 23:29 IST

పరిణతి చెందిన వయస్సో

పరిణమించిన మనస్సో

పరిమళించిన యశస్సో

పరిహరించిన తమస్సో

ప్రజ్వరిల్లిన వెసూవియస్సో ...

దీనికి ఎల్లలు లేవు

ఎత్తులూ లేవు

పల్లాలూ లేవు

దిక్కులూ లేవు

అయినా పిక్కటిల్లుతూ ఉంటుంది

కొలవడానికి వ్యాసమూ లేదు

పొడవు వెడల్పులూ లేవు

ఏది "పై" ది

ఏది కిందిదీ

ఏది పక్కదీ

ఏది ముందుదీ

ఏది వెనుకదీ

తెలీదు ... తెలుసుకునే అవకాశమూ లేదు

అయినా దీనికీ వైశాల్యముంది

ఆర్ద్రత నిండిన

హృదయమంత

ఆతృత తో కూడిన

కాలమంత

ఆవేశం కొలవలేని

దూరమంత ...

నీ చెక్కిళ్ళూ ... నా ఎక్కిళ్ళూ

తెగని దారం ... చేరని తీరం

తగ్గని కారం... కట్టని హారం

తీరని భారం ... తిరగని వారం

అని భావకవిత్వం రాయడం

నాకు రాదు

అయినా కొలుస్తునే ఉంటా

నిన్ను ... నీ అందాన్ని

నీ వ్యక్తిత్వాన్ని ... నీ స్నేహ మాధుర్యాన్ని

నీ జీవన సాహచర్యాన్ని

నీ ప్రశాంతతని

నీ చిరునవ్వునీ

నీ దయనీ ... నీ ఆలంబననీ

నావైన ... నావే అయిన

నీ అన్నిటినీ ...

ఎప్పడూ సాంత్వననిచ్చే

నీ ప్రేమనీ ...

ఎందుకో తెలుసా ...

అది

ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్

కనుక

గుండ్రని చతురస్రం కనుక

- సాయి శేఖర్

Tags:    
Advertisement

Similar News