ఉదయం మనసంతా చికాకుగా ఉండటంతో మార్నింగ్ వాక్ కి బయల్దేరాను. అది నగర శివారు ప్రాంతం కావటంతో పెద్దగా జన సందడి, వాహనాల రద్దీ లేదు. పైగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.
నా పేరు మాలతి. వయసు అరవై ఐదేళ్ళు. మూడేళ్ళ క్రితం వరకు నేను మా ఆయనతో పాటు మా సొంత వూర్లో ఉండేదాన్ని. మా ఆయన హఠాత్తుగా గుండెపోటు వల్ల మరణించడంతో నేను నగరంలో వున్న నా కుమారుల దగ్గరికి రావాల్సి వచ్చింది.
ఓ ప్రయివేటు స్కూల్లో టీచర్ గా పని చేసిన మా ఆయన జీవితాంతం కష్టపడి ఓ చిన్న ఇల్లు మాత్రమే తీసుకోగలిగాడు. దాన్ని కూడా పిల్లల పైచదువుల కోసం అమ్మేశాడు. మా ముగ్గురు కొడుకులు ఉద్యోగాలొచ్చాక పెళ్ళిళ్ళు చేసుకొని నగరంలో స్థిరపడ్డారు. మా ఆయన పోయాక నన్ను నగరానికి తీసుకొచ్చారు.
ఓ ఏడాది నేను పెద్ద కొడుకు ఇంట్లో వున్నాను. రెండో ఏడాది రెండో కొడుకు ఇంట్లో, మూడో ఏడాది చిన్న కొడుకు ఇంట్లో వున్నాను. ఇలా నన్ను ఒక్కో ఏడాది ఒక్కొక్కరు తమ ఇంట్లో ఉంచుకోవాలని నా కొడుకులు ముందే ఒప్పందం చేసుకున్నారు.
"మాలతీ.." ఎవరో నన్ను పిలవటంతో ఆలోచనల్లోంచి తేరుకొని తల తిప్పి చూశాను. రోడ్డు పక్క గల ఓ పాత ఇంటి కిటికీలోంచి ఓ ఒకామె చెయ్యి ఊపుతూ నన్ను పిలుస్తోంది. ఎప్పుడో చూసిన ముఖం! కాని గుర్తుకు రాలేదు.
"నేను రాధికను మాలతీ, గుర్తు పట్టలేదా?" అందామె. ఆపేరు వినగానే ఆమె ఎవరో గుర్తొచ్చింది.
ఇరవై ఏళ్ళ క్రితం రాధిక మా వూర్లో మా పక్కింట్లోనే ఉండేది. పెళ్ళై ఇరవై ఏళ్ళు గడిచినా ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఎంత మంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని మొక్కుబడులు మొక్కుకున్నా ఆమె కడుపు పండలేదు. వీధిలోని జనం ఆమెను గొడ్రాలు అంటూ ఎగతాళి చేసేవారు. ఆమె అత్తామామలతో పాటు భర్త కూడా ఆమెను వేధించేవాడు. ఆ వేదన భరించలేక ఆమె ఓ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎవరికీ కనపడలేదు. ఇన్నేళ్ళ తర్వాత నాకు కన్పించింది.
నేనిలా ఆలోచిస్తుండగానే రాధిక బయటికొచ్చి చొరవగా నా చెయ్యి పట్టుకొని నన్ను ఇంట్లోకి పిల్చుకెళ్లింది. లోపల ఓ పెద్ద హాల్ నిండా చిన్న పిల్లలున్నారు. వారంతా టిఫిన్ చేస్తున్నారు.
"ఎవరు రాధికా ఈ పిల్లలు?" నేను ఆశ్చర్యంగా అడిగాను.
"వీళ్ళంతా నా పిల్లలే అనుకో" నవ్వుతూ అంది రాధిక.
తర్వాత వివరంగా చెప్పింది. "ఆ రోజు నేను నేను జీవితంపై విరక్తి పుట్టి రైలు కింద పడి చనిపోవాలని వెళితే ఓ పెద్దమనిషి నన్ను కాపాడాడు. నా కథ విన్న తర్వాత నాకు ధైర్యం చెప్పి ఇక్కడికి పిల్చుకొచ్చాడు. తన కుటుంబమంతా ఓ ప్రమాదంలో చనిపోవడంతో తన ఇంటిని ఓ అనాథాశ్రమంగా మార్చాననీ, ఈ అనాథల సేవలోనే మనశ్శాంతి పొందుతున్నానని చెప్పాడు. నన్ను కూడా ఇక్కడే వుండమన్నాడు. ఆ రోజు నుంచి నేను పిల్లలకు వండిపెడుతూ ఇక్కడే ఉండిపోయాను.
ఈ అనాథల వల్ల నాకు పిల్లలు లేని లోటు తీరింది. ఆ పెద్దమనిషి చనిపోయేముందు ఈ ఆశ్రమాన్ని నాకు అప్పగించాడు. ఒకప్పుడు ఇక్కడ ఉండి ఇప్పుడు పెద్ద హోదాల్లో ఉన్న కొందరు అనాథల ఆర్థిక సాయంతో ఈ ఆశ్రమం నడుస్తోంది. ఈ పిల్లలు నన్ను' అమ్మా'అని పిలుస్తుంటే నాకుఅనిర్వచనీయమైన ఆనందం కలుగుతోంది" ఉద్వేగంగా చెప్పింది రాధిక.
తర్వాత నేను వద్దన్నా వినకుండా రాధిక నాకు టిఫిన్ వడ్డించింది. తృప్తిగా తిన్నాను. రాధికని సొంత తల్లిలా భావిస్తూ పిల్లలు ఆమెపై కురిపిస్తున్న ప్రేమను చూసి నాకు ఆమెపై ఒకింత అసూయ కలిగింది.
కాస్సేపు అక్కడ సరదాగా గడిపాక నేను రాధికకి వీడ్కోలు చెప్పి ఆశ్రమంలోంచి బయటికొచ్చాను.
"మాలతీ, నీకు ముగ్గురు కొడుకులున్నారు. అదృష్టవంతురాలివి. ఇప్పుడు ఏ కొడుకు ఇంట్లో వుంటున్నావ్? అడ్రసు చెప్పు. తీరిక వున్నప్పుడు వస్తాను" అంది రాధిక.
"నువ్వు రావద్దు, నేనే వస్తాను" అన్నాను.
"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది రాధిక.
"ఎందుకంటే నేనిప్పుడు ఉండేది వృద్ధాశ్రమంలో. ముగ్గురు కొడుకుల ఇళ్ళల్లో ఉండి చూశాను. కాని వారు నన్ను తల్లిలా కాకుండా ఓ వంట మనిషిలా చూశారు. పైగా నేను వారికి భారంగా మారానని అర్థమైంది. అందుకే కొద్ధి రోజుల క్రితం నేను ఓ వృద్ధాశ్రమానికి వచ్చేశాను. ఇప్పుడు నీకూ నాకు పెద్దగా తేడా లేదు రాధికా !నువ్వు పిల్లలు లేని గొడ్రాలివి. నేను పిల్లలున్న గొడ్రాలిని. అంతే తేడా!" ఉద్వేగంగా చెప్పి గబగబా ముందుకు వెళ్ళిపోయాను.
- ఆదోని భాషా (ఆదోని)