పదిమందిలో నేను మమేకమవుతాను
కానీ అంతర్మధనంలో నేను ఒంటరిని.
నా చుట్టూ కొన్ని వేల కాంతిపుంజాలు
కానీ నేనుండేది గాఢాంధకారంలోనే
అనవరతమూ ప్రేమైక జీవినే
ప్రేమను శ్వాసిస్తాను, ఆస్వాదిస్తాను.
అది నైజం,
మరి అప్పుడప్పుడు ఆ ప్రేమే వెక్కిరిస్తుంది,నిలదీసి ప్రశ్నిస్తూ నివ్వెరపరుస్తుంది.
ప్రతి చిన్న రాయైనా , మహనగమైనా
సెలయేరైనా మహా సముద్రమైనా ప్రేమమయమే అపురూపమే.
మనసుకు సాంత్వన కలిగిస్తుంది.
మహదానందంలో ముంచెత్తుతుంది.
ఇంత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా
ప్రతిక్షణం చీకటి వెలుగుల దోబూచులాట.
ఒక్కక్షణం హిమవన్నగాన్ని అధిరోహిస్తుంటాను,
మరుక్షణం పాతాళానికి జారిపోతుంటాను.
ఎంతమందో వారి అమృతహస్తాలతో
చేయూతనిస్తారు.
వారి ప్రేమపాశంతో వూతమిస్తుంటారు.
మళ్ళీ మనిషిగా నిలబెడుతుంటారు.
వారికి నేనేమివ్వగలను
కృతజ్ఞతల వెల్లువ తప్ప
అoదుకేనేమో ప్రతి చెట్టులోనూ ప్రతి పుట్టలోనూ
ఆనందం వెతుక్కుంటాను.
ఎక్కడ ప్రేమతత్వం పొంగిపొరలుతుందో,
ఎక్కడ ప్రేమహస్తాలు
పొదివి పట్టుకుంటాయో
బేషరతుగా
వారి ప్రేమకు దాసోహమైపోతుంటాను
మళ్ళీ మనిషినవుతుంటాను.
ఇది చీకటి వెలుగులసయ్యాట,
చీకటినుండి
వేయి వెలుగురేఖలవైపు
నడుస్తున్న
ప్రయాణపు బాట
- గడియారం సునంద