నిజంగా నిద్రిస్తున్న వాణ్ణి
ఉత్త పసిపిల్లవాడు లేపొచ్చు
నిద్ర నటిస్తున్న వాండ్ల మీద
ఏనుగులు ఎక్కించి తొక్కించినా
ఏమీ చలనం ఉండదు
తెల్లవారితే సూర్యుణ్ణి
మూసెయ్యడానికి
మేఘాలతో జైళ్లు కడుతున్నారు
శ్మశానంలో దయ్యాలు
శవాలను పాలిస్తున్నాయి
అంతటా ఎక్కడ చూసినా
నటిస్తున్న వాళ్ళు
అధిక సంఖ్యాకు లున్నారు
వాళ్ళు ప్రతినిధులుగా గెలుస్తారు
అక్కడొకడు యిక్కడొకడు మేలుక్కూచుని వుంటాడు
అందరినీ లేపుదామనే ఆశతో
ఎక్కడో ఒక వెలుగురవ్వ కోసం
నడుస్తూ వెళ్ళే నాబోటి వాండ్లకు
కళ్ళల్లోనో కాళ్ళల్లోనో తుమ్మముళ్ళు గుచ్చుకుంటాయి
విననని భీష్మించుకున్న లోకానికి
చెప్పడం ఎందుకో తెలేడం లేదు
చెప్పడం కాస్తో కూస్తో
చేతనవును గనుక
ఊరుకుని చేసేదీ కనపడడం
లేదు గనుక.
- కుందుర్తి
Advertisement