ఎర్రజెండా యవ్వనంలో
ఎగిరెగిరి దూకింది
కొత్తదనపు రక్తారుణ
కలల వెలుగు పరిచింది
అడవిలోని ప్రతి ఆకులో
ఆవేశము నింపింది
కొమ్మలోని బతుకు పూలకు
ప్రశ్నించుట నేర్పింది
విలువలు గల మల్లెలను
కోరికోరి పూయించింది
పక్షులన్నీ స్వేచ్ఛా గాలిని
నచ్చినట్టుగా మలుపుకున్నవి
కొండా,కోనా, సెలయేళ్లు
కాలిగజ్జెలై యెగసినవి
అడవి నిండా యెర్రమల్లెలు
తోరణాలతో మురిసినవి.
ఎరుపంటే...? చైతన్యం.
ఎరుపంటే...?బరోసా!
ఎరుపంటే...?గుండె ధైర్యం.
ఎరుపంటే...? ప్రశ్నించే తత్వం.
ఎరుపంటే రుచించని
ఇనుప ముక్కు రాబందుల
యెదనిండా దిగులైనది
అడవిని కబళించేందుకు
రాబందులు యేకమైనవి
ఆకస్మిక దాడులతో
అణచివేత కెగవడ్డవి
కొమ్మల్లో దాగున్న
ఎర్రపూలను ఏరినవి
ఎర్రమల్లెల తోరణాలను
ఎద పగుల చీరినవి.
కొండకోనల అందమంతా
బోడిగుండు రూపమైనది
అడవితల్లి వొళ్ళంతా
జల్లెడ రంధ్రాల
బుల్లెట్టు గాయమైనది
ఇప్పుడు,
నింగి హద్దులైన
ఎర్రజెండా రెపరెపలు
రాబందుల రెట్టలతో
తడిసి ముద్దయి,
ఎండి వరుగులై
కంపుగొడుతున్నది
ఎత్తిపట్టిన జెండా కర్రకు
మనువాద చెద సోకింది
అందుకేనేమో!
ఎరుపు రంగు వెల్సిపోయి
చిరుగులు పట్టి వెలవెల బోయింది
అడవి కళదప్పి,
మసకబారి బోసిపోయింది
వనంలోని పక్షులన్నీ
దిగులు కమ్ముకొని
ఎర్రెర్రని చైతన్యపు
వెలుగు సూర్యుల రాకకై
స్వచ్ఛమైన స్వేచ్ఛా వాయువులు
వీచే పవనాల జాడకై
తమ యెదురుచూపులను
అన్ని దిక్కులా సారిస్తున్నాయి.
⁃ అమరవేణి రమణ