ఆ రోజులే వేరు

Advertisement
Update:2023-05-01 12:45 IST

చిన్నప్పుడు

ఆకాశాన్ని దుప్పటిగా కప్పుకొని

పై మేడ మీద

ఒకే పక్కమీద పడుకొన్నరోజుల్లో ...

మనకు ఫోటో తీసుకోవాలన్న

ధ్యాసే లేదు

స్కూల్ బయట రేగికాయలు, ఉప్పద్దిన జామకాయలు,

మామిడి కాయ ముక్కలు,

ఐస్ ఫ్రూట్ లు చప్పరించటాన్ని

ఫోటో తీసుకోలేదు

రికార్డ్ చేసుకోలేదే!!

ఏసీ లేని త్రీ టైర్ బోగీలో

కిటికీ పక్కసీట్ కోసం కొట్లాడుతూ ,

అమ్మ తెచ్చిన

పూరీ కూర, పులిహోర,

పెరుగన్నం తింటూ,

మంచినీళ్ళ మరిచెంబుతో చేసిన తిరుపతి ప్రయాణాలు

అరెరే! ఒక్క ఫోటో కూడా

తీసుకోలేదే అప్పుడు !!!

అయినా ఎందుకో !!

ప్రతి చిన్నదీ

గుర్తుండి పోయిందే!

కారణం

మనం ఆరోజుల్లో ఫోటోలు

మనసుతో తీసేవాళ్ళమేమో

కానీ కెమెరాతో కాదు .

ఎంత మధుర మైనవి ఆరోజులు.

గడియారం గోడ మీదో

లేక

కేవలం నాన్న చేతికో ఉండేది

కానీ సమయం

ఇంటిల్లిపాదికీ వుండేది.

నేస్తమా !

ఆ రోజులే వేరు

తేహినో దివాసా గతా:

-డాక్టర్ భండారం వాణి

Tags:    
Advertisement

Similar News