నేను కాసిన్ని నీళ్లను
వాగ్దానం చేశాను
తను నాకు చల్లని సాయంత్రాన్ని
బహూకరించింది
నేను
జానెడు జాగానిచ్చాను
తను నా హృదయం
తట్టే స్పందన చూపింది
నేను ఇంత
మన్నే వేశాను
తను పువ్వై నవ్వి
త్యాగం నేర్పింది
కొన్నిసార్లు ________
- దేవనపల్లి వీణావాణి
కొన్నిసార్లు...
ఆగిపోవడం అంటే
ముళ్లకంపను తప్పుకోవడం
తెలుసుకోవడం అంటే
కలత రాకుండా మసలుకోవడం
మరచిపోవడం అంటే
మరకల్ని గుట్టుగా దాచుకోవడం
పడిపోవడం అంటే
ఒడ్డుకు ఈవల జారిపోవడం
నిలబడడం అంటే
తనవారంటూ లేనప్పుడు
తడబడక పోవడం...!
తలపడడం అంటే
తల పండేదాకా
కాలానికి తలూపడం...!!
- దేవనపల్లి వీణావాణి
Advertisement