నలిగిన రాతిరిదుప్పటిని దులిపి
దోసిట్లో కొన్ని కలలతారల్ని పోగేసుకుంటుంది
కనుసన్నల్లో మిగిలిపోయిన కన్నీటి కాటుకను దిద్దుకొని
కొత్తనవ్వువర్ణం అద్దుకొంటుంది
ఎదవాకిట్లో విరిగిన
చీకటిమాటల్ని ఊడ్చేసి
మనస్సుఅద్దాన్ని శుభ్రపర్చుకొంటుంది!
తనలోని
దుఃఖపునదిలోనుంచి గుండె తడిసేంత నీటిని తోడుకొని
ఎండిన ఆశలనేలపై కళ్ళాపిగా జల్లుతుంది
అస్థిత్వకాళ్ళను మడిచి
ఉనికి వెన్నెముకను వంచి
పేర్చుతూ పోయిన 'నా' అనుకొనే చుక్కలు
కొంచెం కొంచెంగా మాయమౌతుంటే
చిట్టచివరి వరుసలో తప్పని
ఒంటరిసంతకం చేస్తుంది!
చెదిరిన నిన్నటిరంగుల ఆనవాలేదైనా ఇంద్రధనుస్సై తనముంగిట వాలుతుందేమో అని తపిస్తుంది
చూపుల్ని తప్పించుకొని నడిజామునే
ఎగిరెళ్లిపోయిన వెన్నెలపావురాళ్లకై వెతికి వెతికి
అలసిపోతుంది
వేకువగిన్నెలో మిగిలిన నిజాలపిండి
నవ్వుతుంటే
తను ఆకాశంలోసగం
రేయిపవళ్ళసంగమం అని సర్దిచెప్పుకుంటూ
కొన్ని చెరిగినచుక్కల్ని కలుపుతూ
కొన్ని చిక్కులచుక్కల్ని దాటుకొంటూ
హృదయతీగని మెలిపెట్టి పైపైకి పాకి
బంధపుపూలముగ్గుని
చిక్కగా పోస్తుంది
రాత్రి జరిగిన హత్య ఎవరికీ తెలీదు
తెల్లవారేప్పటికి ఆమె
తూర్పున ఓర్పుముగ్గై విరుస్తూనే ఉంటుంది.
అనాదిగా ఆమె దినచర్య అదే
—డి.నాగజ్యోతిశేఖర్
(మురమళ్ల, తూర్పుగోదావరి జిల్లా)