కొన్ని చుక్కలు
తమను తాము
పెద్దవిగా చూపించుకొనే
తాపత్రయంలో ఉన్నాయి,
మరికొన్ని చుక్కలు
తాము క్షణ క్షణానికీ
కుంచించుకుపోతున్నామేమోనన్న
బాధలో ఉన్నాయి..
కొన్ని చుక్కలు
అత్యాశల రంగులనద్దుకొని
వెలిగిపోతున్నాయి,
మరికొన్ని చుక్కలు
ఆత్మవిశ్వాసం లేక
వెలవెల పోతున్నాయి..
తమంత తాముగా
తమ తమ లోలోపలి చక్కదనాలను
గుర్తించని ఈ చుక్కలన్నీ,
నిజానికి తామంతా
ఎంతో అందమైన వారమనీ,
అతి చక్కని వరుసలలో
ఇమిడి ఉన్నామనీ
తెలుసుకోలేకున్నాయి..
రా,
చుక్కల్ని కలుపుదాం రా..
ఇటు సమస్యల చుక్కల్ని
అటు ప్రక్కన గల సమాధానాలతో,
అటు దారి తప్పిన చుక్కల్ని
ఇటు గల దార్శనికులతో,
అధికారంతో పైకెగిరిన చుక్కల్ని
అర్హత ఉండి ప్రక్కకు ఒరిగిన వాటితో,
అనుభవం గల చుక్కల్ని
అప్పుడే పుట్టిన వాటితో,
అలా అలా కలిపేద్దాం..
పాత గాయాలనూ,
పాచి భావాలనూ,
పై పై అసమానతలనూ,
పసలేని అభ్యంతరాలనూ,
అన్యాయాలనూ,
అసహనాలనూ,
అలా అలా చెరిపేద్దాం..
చెదురు మదురుగా
చెల్లా చెదురైనట్లున్న వాటిని
చేరదీసి, దారి జేసి,
కుడి ఎడమలకు,
ముందు వెనుకలకు,
కొంచెం కొంచెం,
అలా అలా జరుపుదాం..
సమాజమనే అపురూపమైన వాకిలిలో మొలిచిన
అందమైన చుక్కల్ని అన్నిటినీ కలిపి,
మానవత్వపు మనసు ముగ్గును,
ముచ్చటగొలిపేలా తీర్చిదిద్దుదాం..
రా,
చుక్కల్ని కలుపుదాం రా..
రామ్ డొక్కా, (ఆస్టిన్, టెక్సస్,USA)