పందెం బరి

Advertisement
Update:2023-01-17 13:00 IST

రాజులు పోయారు

రాచరికాలు పోయాయి

సంప్రదాయం పేరిట తెలుగునాట

ఉన్మాదం ఏరులై పారుతోంది

డేగ పింగల సీతువా

కార్పోరేట్ల పేర్లతో

కోళ్ళకు కత్తులు కడుతున్నారు

కోట్లకు పందెం కాస్తున్నారు

ఆశకు అదృష్టానికి మధ్య

కోళ్ళను బరిలో బలి ఇస్తున్నారు

బరి ఇప్పుడు యుద్ధక్షేత్రం

బరి చుట్టూ మనుషుల సందోహం

యుద్ధం కోళ్ళ మధ్య కాదు

తొడలు కొట్టే మనుషుల మధ్య!

కోళ్ళకు కత్తులు కట్టినప్పుడే

మనిషిలోని పైశాచికత్వం బయట పడింది

బలిసిన పుంజులు బరిలో తలపడినట్టు

తెగబలిసిన తలకాయలు

బరి చుట్టు ప్రదక్షిణ చేస్తున్నాయి

పిస్తాబాదం తిన్న పుంజులు

బరిలో హోరాహోరీ తలపడుతున్నాయి

మదమెక్కిన మనుషులు

వినోదం కళ్ళప్పగించి చూస్తున్నారు

మనిషికి ధనదాహం

కోడికి ప్రాణసంకటం

గెలుపు ఓటమిలు కోళ్ళ మధ్య కాదు

స్వార్థం పెరిగిన మనుషుల మధ్య!

గెలిస్తే మనిషిది విజయం

ఓడితే కోడికి మరణం

ఓడినా గెలిచినా

చట్టం దృష్టిలో

మనిషే ఇక్కడ నేరస్తుడు!

- చొక్కరతాతారావు

Tags:    
Advertisement

Similar News