అడుగు ముందు నిశ్శబ్దం

Advertisement
Update:2022-11-15 12:53 IST

అడుగు ముందు నిశ్శబ్దం

వాలే పొద్దుని చిటికెన వేలి మీద మోస్తూ ఆకాశం

గోధూళిని దాటలేని పైరు పదాలు.

దీపం వెలుగుల్లో

రేపటి కల కోసం.

రెక్కల మధ్య తలవాలుస్తూ...ఓ పక్షి

చీకటి ఒడిలో ఒదిగిపోతూ...

ఒకింత నిశ్శబ్దంగా.

కలవని చకోర కలవరింతల్లా...ఆ రైలు పట్టాలు

క్రమంగా దూరమవుతూ...రైలుకూత.

మరొక తీరం కోసం...ఆహ్వాన ప్రకంపనాలు.

కలిపే గమ్యానికి ముందు...

ఓ నిశ్శబ్ద నిరీక్షణ.

రాత్రి పదాలు కూరుస్తూ వుంటుంది

వేకువ హుషారుగా పాటందుకుంటుంది.

ఇంకా కొన్ని పదాలు నీలితెరల మాటునే...

మళ్ళీ వెనక్కి మరలి...

నిశీధిలోకి జారిపోతూ...

చితికిన నిశ్శబ్దం అంచులమీద.

సిందూర తుషారాలతో మలిపొద్దులు

వెన్నెల వర్షంలో చీకటి విహారాలు

చివరి అడుగులు మాత్రం ...

మధ్యాహ్న నీడల్లో.

అక్కడెక్కడో

అపురూపమైన అనుభూతులు వ్రేలాడుతూ వుంటాయి.

సమయాలు మాత్రం యిక్కడే...

గతాల గుండెల్లో

భవిత బంగరు కిరణాల్లో

ఆశగా...

చిరునవ్వు మూటల్ని కట్టుకుంటూ...

అడుగు పడని స్వప్న శిల్పాల్లా...

నిశ్శబ్ద సముద్రంలో మునిగిపోతూ...

- స్వర్ణ శైలజ (విశాఖపట్నం)

Tags:    
Advertisement

Similar News