పాశ్చాత్యులు అనగానే విడాకులూ , విచ్చలవిడి జీవితమే అనిపిస్తుంది కొందరికి కానీ ఆ స్త్రీల ప్రేమ కవిత్వం చూడండి
చివరికి
ఎలిజబెత్ ఆకర్స్ అలెన్
———————————
చివరికి
జీవితం తొలి పొద్దులను వెచ్చ జేసిన
వేసవి జిలుగంతా ముగిసిపోయాక
నీచేతి వేళ్ళు ప్రేమగా నా వేళ్ళను తడుముతాయి
చివరికి చివరికి వాటిని హత్తుకుంటాయి
ఆకులు
లేని ఆ పొదరి౦టి పై
గూడు కట్టుకు౦దుకు
ఏ కోయిలా తరచూ రాదు
హేమంతం దోచుకుని శిశిరం గడ్డకట్టించినా
ప్రియమైన హృదయమా
ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు
నా కళ్ళకింద నీడలూ చెక్కిళ్ళపై చాళ్ళు ఉన్నా
నిజానికి ఈ మచ్చలు
కాలం ఏమాత్రం బాధపడని నాగలి
ప్రతి బాల సౌ౦దర్యాన్నీ గెలుచుకోడమో
ప్రేమికుని ప్రతిజ్ఞ అందుకోడమో
యౌవనం వికసిస్తున్న పచ్చిక బయలును బద్దలు చేసి దున్నేస్తు౦ది
నా విషాదపు వాడిన వదనమైనా
చీకట్లు మూగిన హృదయమైనా
నువ్వు నన్నిప్పుడు ప్రేమిస్తున్నావు
వృధా అయిన కన్నీళ్లను ఇహ లెఖ్ఖి౦చను
అవి చిందే ప్రతిధ్వని ఏదీ ఎక్కడా మిగల్లేదు
నా ఒంటరి సమయాలలో బదుఃఖి౦చను
అప్పటి కాలానికో నా అదృష్టానికో భయపడను
కనుబొమలనో హృదయాన్నో బరువెక్క నివ్వను
ఇంత ఆలస్యంగా వచ్చినా దృఢమైన ప్రేమ
మన ఆత్మలు అనవరతం నిలుపుకు౦టాయి దాన్ని
2. నా నది
ఎమిలీ డికిన్సన్
———————-
నా నది , నీలి సంద్రమా
నీవైపు పరుగులు పెడుతుంది
నన్ను స్వాగతిస్తావా?
నా నది జవాబుకు ఎదురుచూస్తో౦ది
ఓహో సముద్రమా అందంగా అగుపి౦చు
ఎన్నో ప్రవాహాలను
ఎక్కడెక్కడి మూలల నుండో
తెప్పిస్తాను
జలదీ చెప్పు , నన్ను గ్రహించు
3.
నేను చెయ్యలేనిది నా ప్రేమ చేసినప్పుడు, నేను చెయ్యనిది
మేరీ ఎలిజబెత్ కాలరిడ్జ్
———————————
నేను చెయ్యలేనిది నా ప్రేమ చేసినప్పుడు, నేను చెయ్యనిది
అతని స్వరం వినిపిస్తుంది ఆనందంగా గాలిలో తేలి
పెద్దగా, " ఓ సౌందర్య రాశీ కళ్ళు మూసుకో , నువ్వు చూడకు
ప్రేమ గుడ్డిది "
నేను చెప్పనిది నా ప్రేమ చేయనప్పుడు , నేను చెప్పనిది
ఒక సంబరపు నవ్వుతో నా భయాలు శా౦తపరుస్తూ
గుసగుసగా " సౌ౦దర్య రాశీ , వినకు నువ్వు వినద్దు
ప్రేమకు చెవులున్నా యా?"
నా ప్రేమ చెప్పినప్పుడు, " నన్ను ఎల్లకాలం అడగమంటావా?
ఆమె కళ్ళులేనిది వినలేనిది నన్ను రమ్మని అనదు కదా?"
నాహృదయం గొణిగి౦ది " ప్రియాతి ప్రియతమా నేను ఎలా చెప్పగలను?
ప్రేమ మూగది "
4. ఎప్పుడైనా ఇద్దరు ఒకరైతే ..........
..
ఆనీ బ్రాడ్ స్ట్రీట్
_____
ఎప్పుడైనా ఇద్దరు ఒకరైతే , అది తప్పకుండా మనమే
ఎప్పుడైనా ఒకమనిషి ని అతని భార్య ప్రేమిస్తే అది నువ్వే
ఎప్పుడైనా ఒక భార్య భర్త వల్ల ఆనందిస్తే
నాతో పోల్చుకో , స్త్రీల్లారా , మీకు వీలయితే
బంగారు గనులకన్నా నాకు నీప్రేమ విలువైనది
తూర్పున ఉన్న సంపదలేవీ దానికి సాటి రావు
నా ప్రేమ ఎలాటిదో తెలుసా ? ఏ నదులూ దాని దాహం తీర్చలేవు
నీ ప్రేమ తప్ప మరేదీ దానికి సాటి లేదు
నీ ప్రేమ ఎలాటిదో కాని ఏ విధంగానూ తిరిగి చెల్లించ లేను సుమా
కాని ప్రార్దిస్తాను ఆపై వాడే నానా రకాలుగా ప్రతిఫలం ఇమ్మని
మనం ఉన్నంత వరకూ ప్రేమలోనే శ్రమిద్దాం
మనం లేకపోయినా ఎప్పటికీ జీవించే ఉందాం
(అనువాదం : శ్రీమతి స్వాతి శ్రీపాద)