ఈ వర్ష రుతువు
రాత్రి కురవని వానలా
నాన్నగారి జ్ఞాపకం
వెచ్చగా కౌగిలించుకుంది.
ఈ భాద్రపదం పలవరింతల్లో పొంగుకొచ్చిన
దుఃఖపు తలపు
గుండెల్లో వరద గూడేసింది.
రూళ్లకర్రను దొర్లిస్తూ
ఫైళ్లలో గీతలు గీసినట్టే,
సంసారాన్ని
మార్చింగ్ చేయించడం
ఆయనకే సాధ్యం
అప్యాయత అంటే
ఆలింగనం చేసుకోవడమే కాదు.
క్రమశిక్షణ అంటే
కర్రపెత్తనం కాదని
ఆయన కంటి ఎరుపే నేర్పింది.
అనురాగం అంటే
గారాబం చేయడం కాదు,
అవసరమైనవాటినే
ఇవ్వాలన్నది
ఆయన అవగాహనే
బాల్యంలోనే కాదు
యవ్వనంలోనూ
ఆయనకు ఎదురపడాలంటే
సిగ్గంత భయం.
చెయ్యెత్తు కొడుకు
చేతికాసరా కాకపోయినా,
చెక్కు చెదరని గాంభీర్యం
ఆయన సొంతం.
జీవితపు బొమ్మా బొరుసులో
ఏది పడినా,
చేయి చాపని బింకం
ఆయనకొక అలంకారం.
మీ నాన్నలా, వాళ్ల నాన్నలా,
మా నాన్న కూడా..
ప్రపంచానికి అతి సామాన్యుడే కావచ్చు. కానీ...
నా జీవితాన్ని
అసామాన్య తీరాలకు చేర్చిన మాన్యుడు
అమావాస్య చీకట్లను నేర్పుగా దాచిపెట్టిన నిండుచంద్రుడు.
- దేశరాజు (హైద్రాబాద్ )