ఆ విషయాలు అప్పుడే చెబితే కుటుంబం పరువు పోయేది..

వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరుకుంటున్నామని, కానీ సీబీఐ విచారణ పక్షపాతంగా సాగుతోందనే అనుమానాలున్నాయని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.

Advertisement
Update:2023-04-18 14:58 IST

వైఎస్ వివేకా హత్య కేసు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కీలక విషయాలన్నీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి కోర్టులో వేసిన పిటిషన్లలో వివేకా వ్యక్తిగత విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయనకు ఉన్న ఇతర సంబంధాల గురించి గుర్తు చేశారు. ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుకి ఆయనకు ఉన్న ఇతర సంబంధాలకు కారణం ఉందన్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ విషయాలను ప్రస్తావించారు. నేరుగా వివేకా సంబంధాలను ఆయన వివరించలేదు కానీ.. వాటి గురించి బయటకు చెప్పుకుంటే కుటుంబం పరువు పోయేదని అన్నారు. అందుకే అప్పట్లో ఎవరూ ఆ ప్రస్తావన చేయలేదన్నారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయని చెప్పారు సుబ్బారెడ్డి.

వివేకా హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరుకుంటున్నామని, కానీ సీబీఐ విచారణ పక్షపాతంగా సాగుతోందనే అనుమానాలున్నాయని చెప్పారు వైవీ. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున అంతకు మించి తానేమీ మాట్లాడబోనన్నారు. వివేకా ఇతర సంబంధాల గురించి మాత్రం ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కుటుంబం పరువు పోకూడదనే ఆ విషయాలను అప్పట్లో బయట పెట్టలేదన్నారు.

విజయ్ కుమార స్వామి ఎవరు..?

విజయకుమార్ స్వామి ఇటీవల సీఎం జగన్ కు ఆశీర్వాదం ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఆయన లాబీయింగ్ కి వచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా దుష్ప్ర చారం చేస్తోందని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. రామోజీ రావు వియ్యంకుడి విమానంలోనే ఆయన విజయవాడకు వచ్చారన్నారు. రామోజీ బంధువు ప్రత్యేక విమానంలో వాళ్ల కార్యక్రమం కోసమే స్వామి వచ్చారని.. ఆ కుటుంబమే ఆయన్ను పిలిపించుకుందన్నారు. మీరు పిలిస్తే దైవాశీస్సుల కోసం? మా దగ్గరకొస్తే లాబీయింగ్ కోసమా..? అని ప్రశ్నించారు. స్వామీజీ ఆధ్వర్యంలో రామోజీరావు బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం జరిగిందన్నారు. స్వామీజీలు, దేవుళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం నీచమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. 

Tags:    
Advertisement

Similar News