ఇదెక్కడి ర్యాగింగ్.. నా మైక్ లాక్కుంటున్నారు

తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, యువగళాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని అంటున్నారు లోకేష్. టీడీపీ అనుకూల మీడియా కూడా లోకేష్ ని చూసి జగన్ భయపడుతున్నారని, అందుకే ఆయన మైక్ లాగేసుకుంటున్నారని కథనాలిస్తోంది.

Advertisement
Update:2023-02-11 13:22 IST

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మెరుపులేవీ లేవని తేలిపోయింది. పాదయాత్ర 16వరోజుకి చేరుకున్నా కూడా ఎక్కడా జనాల్లో లోకేష్ యాత్ర గురించి చర్చ లేదు. పైగా ఆయనకోసం జనాల్ని పోగు చేస్తున్నారనే ఆడియో లీకులు మరింత ఇబ్బందిగా మారాయి. ప్రతిరోజూ లోకేష్ ఏదో ఒక ఊరిలో బస చేయడం, అక్కడ జనాలతో మాట్లాడటం పరిపాటి. అయితే ఆయన మార్గ మధ్యంలో కూడా మాట్లాడాలనుకుంటున్నారు. వాహనంపై ఎక్కి మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతో ఆమధ్య మిద్దెలపైకి ఎక్కారు. పోలీసులు అక్కడ కూడా కాపలా పెట్టడంతో ఇప్పుడు తన వెంటే స్టూల్, మైక్ తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ మైక్, స్టూల్ కూడా పోలీసులు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు నారా లోకేష్.

రోడ్డుపైన స్టూల్ వేస్తే ఎలా..?

నారా లోకేష్ రోడ్డుపైన ఎక్కడ పడితే అక్కడ స్టూల్ వేసి నిలబడి మైక్ తీసుకుని మాట్లాడుతున్నారని, రోడ్డుపై ఇదెలా కుదురుతుందని అంటున్నారు పోలీసులు. జీవో-1 అమలులో ఉన్నప్పుడు రోడ్లపై ఇలాంటి సభలు, సమావేశాలు వద్దని సున్నితంగానే చెబుతున్నారు. కానీ లోకేష్ మాట వినకపోవడంతో మైక్ లాక్కెళ్తున్నారు. కొన్నిసార్లు స్టూల్ కూడా లాగేసుకుంటున్నారు.

మేం కూడా ఇలా చేసి ఉంటే..?

అప్పట్లో తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినందుకే కదా మాకు ఈ పరిస్థితి అంటున్నారు లోకేష్. అప్పుడు తాము కూడా ఇలాగే అడ్డుపడి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, యువగళాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని అంటున్నారు లోకేష్. టీడీపీ అనుకూల మీడియా కూడా లోకేష్ ని చూసి జగన్ భయపడుతున్నారని, అందుకే ఆయన మైక్ లాగేసుకుంటున్నారని కథనాలిస్తోంది. ఒకరకంగా యాత్ర హైలెట్ కాకపోయినా, లోకేష్ మైకు లాక్కున్నారని, స్టూల్ లాక్కున్నారనే వార్తలు మాత్రం హైలెట్ అవుతున్నాయి. లోకేష్ యాత్రకు పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నాయి.


మరోవైపు వైసీపీ నేతలు మాత్రం లోకేష్ పాదయాత్ర చేస్తే తమ పార్టీకే మేలు అంటున్నారు. ఆయన ఎంత మాట్లాడితే, ఆయన మాటల్లో ఎన్ని తప్పులు దొర్లితే, ఆయన సామర్థ్యం అంతగా ప్రజలకు తెలిసొస్తుందని, లోకేష్ యాత్ర టీడీపీ నాశనానికే అని శాపనార్థాలు పెడుతున్నారు. అదే సమయంలో పోలీసులు మాత్రం లోకేష్ మైక్ లాక్కుని పరోక్షంగా ఆయన యాత్రకు ప్రచారం కల్పిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

Tags:    
Advertisement

Similar News