మళ్లీ తెరపైకి పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం..

పవన్ ని టార్గెట్ చేయాలంటే కచ్చితంగా వ్యక్తిగత విషయాలనే వైసీపీ హైలెట్ చేస్తోంది. జనసైనికుల్ని రెచ్చగొడుతోంది.

Advertisement
Update:2023-05-13 14:44 IST

పవన్ కల్యాణ్ మంచి రాజకీయ నాయకుడా..? చెడ్డ నాయకుడా..? అనే విషయం పక్కనపెడితే.. పవన్ రాజకీయ వ్యాఖ్యలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలి. కానీ వైసీపీ నాయకులు మాత్రం పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎం సీటుపై పవన్ హాట్ కామెంట్స్ చేసిన తర్వాత వైసీపీ నుంచి కాస్త ఘాటుగానే రియాక్షన్లు వచ్చాయి. అందులో మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేయడం అంత ఈజీ కాదు అంటూ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. సీఎం సీటుపై ఆశ లేదని చెబుతున్న పవన్, పార్టీ నాయకులు, ప్రజలను మోసం చేయడం ఎందుకని ప్రశ్నించారు అమర్నాథ్. లోకేష్ పాదయాత్రతో వారాహి ఎక్కడికో పోయిందన్నారు. ప్రావీణ్యం ఉన్న రంగాల్లో జీవితం వెతుక్కోవాలి కానీ.. పవన్ కి రాజకీయం ఎందుకన్నారు..? 2024 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీకి ప్రతిపక్షం అనేది ఉండదన్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. టీడీపీ, జనసేన క్లోజ్ అంటూ కీలక కామెంట్లు చేశారు మంత్రి అమర్నాథ్.

వ్యక్తిగత విమర్శలెందుకు..?

తాను సీఎం కాను, కాలేను అంటున్న పవన్.. పొత్తుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో పొత్తుల గురించి మాట్లాడటం తప్పు కాదు, నచ్చిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదు. మేం సింగిల్ గానే వస్తామంటున్న వైసీపీ.. పక్క పార్టీలు గుంపుగా వచ్చినా పెద్ద నష్టమేమీ లేదంటోంది. అదే సమయంలో సింగిల్ గా వచ్చే దమ్ము, ధైర్యం ప్రతిపక్ష పార్టీలకు లేదంటోంది. గెలుపు వైసీపీకి ఖాయమైనప్పుడు, వైనాట్ 175 అని ధైర్యంగా చెబుతున్నప్పుడు.. ఇక పక్క పార్టీలు కలసి వచ్చినా, విడివిడిగా వచ్చినా జగన్ టీమ్ కి జరిగే నష్టమేమీ లేదు కదా. అలాంటప్పుడు.. పవన్ వ్యాఖ్యల తర్వాత కౌంటర్లలో ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన ఎందుకు..? పిల్లల గురించి మాట్లాడమెందుకు..? కానీ పవన్ ని టార్గెట్ చేయాలంటే కచ్చితంగా వ్యక్తిగత విషయాలనే వైసీపీ హైలెట్ చేస్తోంది. జనసైనికుల్ని రెచ్చగొడుతోంది. 

Tags:    
Advertisement

Similar News