ప్రత్యేక హోదాపై పోరాడదాం రండి.. టీడీపీకి వైసీపీ సూచన
హోదా ఇస్తేనే కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని టీడీపీ కండిషన్ పెట్టొచ్చని సూచించారు శ్రీకాంత్ రెడ్డి. అలా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, యువత జీవితాలు బాగవుతాయని అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడం ఏపీకి వరమని చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక భాగస్వామి కావడం వల్ల ఏపీ ప్రయోజనాల కోసం ఆ పార్టీ గట్టిగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ పట్టుబట్టవచ్చని అన్నారు. హోదా ఇస్తేనే కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని టీడీపీ కండిషన్ పెట్టొచ్చని సూచించారు. అలా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, యువత జీవితాలు బాగవుతాయని అన్నారు శ్రీకాంత్ రెడ్డి.
అవసరమైతే..
ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే వైసీపీ ఎంపీలు కూడా టీడీపీతో కలసి పోరాటం చేస్తారన్నారు శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకి భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి, ఏపీకోసం టీడీపీ ప్రత్యేక హోదా తేవాల్సిందేనన్నారు. అవకాశం వచ్చినప్పుడే హోదాకోసం డిమాండ్ చేయాలని, ఇప్పుడు ఏపీకి అలాంటి అవకాశం వచ్చిందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండి ఉంటే.. వైసీపీ కచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చి ఉండేదన్నారు శ్రీకాంత్ రెడ్డి.
ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు శ్రీకాంత్ రెడ్డి. గెలుపు, ఓటములు సహజం అని.. గెలిచినవారు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయని, అది బాధాకరం అని అన్నారు. పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి సరికాదన్నారు శ్రీకాంత్ రెడ్డి.