తూచ్, అది సెక్రటేరియట్ కాదు.. తప్పు దొర్లిందన్న వైసీపీ

"మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌ లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు." అంటూ వైసీపీ నుంచి మరో ట్వీట్ వచ్చింది.

Advertisement
Update:2023-08-13 12:26 IST

వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ (@YSRCParty) నుంచి వేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. రుషికొండ సెక్రటేరియట్ పై జరిగే నిర్మాణాలు ఏపీ సెక్రటేరియట్ కి సంబంధించినవి అంటూ వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది. అక్కడ సెక్రటేరియట్ నిర్మిస్తుంటే దానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని రావడం ఆ పార్టీకి ఇష్టం లేదని పేర్కొంది.

అయితే ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో వెంటనే వైసీపీ దాన్ని డిలీట్ చేసింది. వాస్తవానికి రుషికొండపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతున్నట్టు గతంలో హైకోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అది సెక్రటేరియట్ అంటూ ఇప్పుడు చెప్పడం కొత్త వివాదాలకు దారితీసింది. అంటే హైకోర్టుకి వైసీపీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందా, కోర్టుని తప్పుదోవ పట్టించిందా అంటూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసింది. ఈ రచ్చతో వైపీసీ ఇబ్బందుల్లో పడింది. వెంటనే ట్వీట్ డిలీట్ చేసింది.





వైసీపీ ట్వీట్ డిలీట్ చేసినా టీడీపీ ఊరుకుంటుందా. స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో టార్గెట్ చేసింది. వైసీపీ ద్వంద్వ నీతి చూడండి అంటూ ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ చేసింది. దీంతో వైసీపీ అధికారికంగా తప్పు దిద్దుకోవాలని ప్రయత్నం మొదలు పెట్టింది. గతంలో పొరపాటు దొర్లింది అంటూ సరికొత్తగా మరో ట్వీట్ వేసింది.


"మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌ లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు." అంటూ వైసీపీ నుంచి మరో ట్వీట్ వచ్చింది. మొత్తమ్మీద రుషికొండపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం, ఆ వెంటనే టీడీపీ కౌంటర్లివ్వడంతో వైసీపీ హడావిడి పడుతోంది. ట్వీట్ వేయడం, దాన్ని డిలీట్ చేయడం, వెంటనే సవరణలివ్వడం.. ఇలా తంటాలు పడుతోంది. ఇంతకీ రుషికొండను తొలిచి అక్కడ ఏయే నిర్మాణాలు చేపడుతున్నారనేదానిపై అధికారిక క్లారిటీ లేదనే చెప్పాలి. 

Tags:    
Advertisement

Similar News