వారసులకు లైన్ క్లియర్.. జగన్ వ్యూహం ఫలిస్తుందా..?

అభ్యర్థిని మారిస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉందనే అంచనాతోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల సిట్టింగ్ లకు షాకిచ్చారు. వారసులకు న్యాయం చేస్తూ కొన్నిచోట్ల వ్యూహాత్మక అడుగులు వేశారు.

Advertisement
Update:2024-01-03 08:48 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావమో, లేక యువనేతలపై నమ్మకం పెరిగిందేమో తెలియదు కానీ.. ఇన్ చార్జ్ ల మార్పు విషయంలో ఏపీ సీఎం జగన్, వారసులకు పెద్దపీట వేశారు. రెండో జాబితాలో ఏకంగా నలుగురు వారసులకు చోటిచ్చారు. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి, రామచంద్రాపురం నుంచి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశ్ కి టికెట్లు ఖరారు చేశారు. ఆయా స్థానాలకు వారిని ఇన్ చార్జ్ లు గా ప్రకటించారు.

జగన్ కొత్త లిస్ట్ బయటపెడుతున్నారగానే కచ్చితంగా సంచలనాలుంటాయనే అనుకున్నారంతా. దానికి తగ్గట్టుగానే సిట్టింగ్ లకు చాలా చోట్ల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. కొందరికి మూడో లిస్ట్ లో చోటు ఉందనే నమ్మకం ఉంది, మిగిలినవారికి ఆ అవకాశం లేదని ఇప్పటికే సిగ్నల్స్ వెళ్లాయి. ఇక వారసులకు అవకాశమిస్తూ సీనియర్ నేతలను సంతృప్తి పరిచారు సీఎం జగన్.

వ్యూహం మార్చిన జగన్..

వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ ఇచ్చేది లేదని గతంలో పలుమార్లు జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పేర్ని నాని కూడా చాలా సందర్భాల్లో మచిలీపట్నం టికెట్ పై కామెంట్ చేశారు. తన కొడుక్కి టికెట్ అడిగినా జగన్ వారించారని, తననే పోటీ చేయమంటున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జగన్ వ్యూహం మారింది. దీనికి కారణం తెలియదు కానీ వారసులకు ఈసారి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రెండో లిస్ట్ లో నలుగురు యువనేతలకు చోటు లభించింది. వీరంతా ఇప్పటికే జనంలోకి వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తండ్రికి తగ్గ తనయులుగా ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, లేక ఎమ్మెల్యేలపై ఉందా అనేది తర్వాతి విషయం. అక్కడ అభ్యర్థిని మారిస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉందనే అంచనాతోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల సిట్టింగ్ లకు షాకిచ్చారు. వారసులకు న్యాయం చేస్తూ కొన్నిచోట్ల వ్యూహాత్మక అడుగులు వేశారు. ఈ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News