స్పీకర్ నోటీసులకు ఆసక్తికర రిప్లై.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ట్విస్ట్

స్పీకర్ తమ్మినేని దగ్గర దీనికి విరుగుడు ఉందా..? ఏకపక్షంగా వారిని సస్పెండ్ చేస్తారా..? వేచి చూస్తారా..? తేలాల్సి ఉంది.

Advertisement
Update:2024-01-25 08:37 IST

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీకి పెద్ద షాకిచ్చారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా వారి ఓటు ఎటువైపో ఊహించవచ్చు. ఆ ఛాన్స్ వారికి ఎందుకివ్వాలనుకున్న అధికార పార్టీ గంటాపై వేటు తర్వాత ఆ నలుగురికి కూడా స్పీకర్ తో నోటీసులు పంపించింది. అయితే వారు తెలివిగా సమాధానమిచ్చారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు తమపై వేటు పడకుండా ఉండేలా ఆ సమాధానాల్లో కొన్ని పాయింట్లు హైలైట్ చేశారు. మరి స్పీకర్ తమ్మినేని దగ్గర దీనికి విరుగుడు ఉందా..? ఏకపక్షంగా వారిని సస్పెండ్ చేస్తారా..? ప్రజాస్వామ్య బద్ధంగా వేచి చూస్తారా..? తేలాల్సి ఉంది.

రెబల్స్ సమాధానమేంటి..?

స్పీకర్ పంపించిన నోటీసులకు సమగ్రంగా బదులిచ్చేందుకు తమకు 4వారాల సమయం కావాలని కోరారు రెబల్ ఎమ్మెల్యేలు. అయితే ఇందులో ఒక్కొకరు ఒక్కో కారణం చెప్పడం విశేషం. అనారోగ్యంతో ఉన్నందున రిప్లై ఇచ్చేందుకు 4 వారాల గడువు కోరారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తనకు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ ను కూడా ఆయన స్పీకర్ కు పంపించారు.

మేం కూడా నిర్థారించుకోవాలి కదా..?

వైసీపీ ఆ నలుగురిపై వేటు వేసింది. దానికి కొన్ని కారణాలు చెప్పింది, వాటికి తగ్గ ఆధారాలు జత చేసింది. స్పీకర్ నోటీసుల్లో ఆ ఆధారాలు కూడా ఆ నలుగురికీ పంపించారు. అయితే అవి అసలైనవో నకిలీవో తేల్చుకోడానికి తమకు సమయం కావాలని మెలికపెట్టారు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నోటీసులతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లు అసలైనవో.. మార్ఫింగ్ చేసినవో నిర్ధారించుకోవాలి కదా అన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వాళ్లు ఇచ్చిన ఆధారాల ఒరిజినల్ కాపీలు కూడా తమకు కావాలన్నారు. సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించిన ఐపీ అడ్రస్సులు కూడా కావాలని కోరారు.

కేవలం రాజ్యసభ ఎన్నికలకోసమే ఈ హడావిడి అనేది అందరికీ తెలుసు. టీడీపీ, జనసేన నుంచి వైసీపీ వైపు వచ్చి, పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా వైసీపీ కండువాలు మెడలో వేసుకుని తిరుగుతున్నఎమ్మెల్యేల సంగతేంటనే ప్రశ్న కూడా వినపడుతోంది. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం తమపై వేటు తప్పించుకోడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాగే సమయం గడపాలనేది వారి ఆలోచన. మరి స్పీకర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News