జగన్ ఫార్ములానే ఫాలో అవుతున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

టీడీపీ కండువా కప్పుకుంటే కచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అర్థబలం ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కోటంరెడ్డి సైలెంట్ అయ్యారు.

Advertisement
Update:2023-03-21 17:22 IST

“తాను చంద్రబాబులాగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను, పార్టీకి, పదవికి రాజీనామా చేసి వస్తేనే ఎవరినైనా వైసీపీలో చేర్చుకుంటాను.” గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న సందర్భంలో వైఎస్ జగన్ అన్నమాటలివి. ఆయన అదే మాటపై నిలబడ్డారు, కానీ అశ్వత్థామ హతః కుంజరః అనే ఫార్ములా పాటించారు. టీడీపీ నుంచి, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పకుండానే తన పక్కనపెట్టుకున్నారు. తెలివిగా వారి కుటుంబ సభ్యులకు మాత్రం కండువా కప్పారు. ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించలేదు కదా అనే లాజిక్ చెప్పారు. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.

టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు..

వైసీపీకి దూరమయ్యాక టీడీపీ టికెట్ పై పోటీ చేస్తానంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే ఆయన ఇప్పటికిప్పుడు టీడీపీలో చేరడంలేదు. టీడీపీ కండువా కప్పుకుంటే కచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అర్థబలం ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కోటంరెడ్డి సైలెంట్ అయ్యారు. జగన్ ఫార్ములా ప్రకారమే తన సోదరుడు గిరిధర్ రెడ్డిని ముందుగా టీడీపీలోకి పంపిస్తున్నారు.

రెండు లాభాలు..

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోలేదు కాబట్టి ఆయనపై వైసీపీ వేటు వేసే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కూడా వైసీపీ స్పీకర్ ని కోరే ఛాన్స్ లేదు. ఇక రెండోది టీడీపీలో కోటంరెడ్డి వర్గం అంటూ ప్రత్యేకంగా ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకునే అవకాశముంది. టీడీపీ నెల్లూరు రూరల్ టికెట్ శ్రీధర్ రెడ్డికే అనే సిగ్నల్స్ కూడా ముందుగానే జనంలోకి పంపించినట్టవుతుంది. అందుకే ముందుగా గిరిధర్ రెడ్డిని టీడీపీలోకి పంపించి రూరల్ సీటుని కోటంరెడ్డి ఫ్యామిలీ రిజర్వ్ చేసుకుంటోంది.

ఆనం సంగతేంటి..?

ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇప్పటికిప్పుడే పార్టీ మారి, అనర్హత వేటు వేయించుకోడానికి రెడీగా లేరు. ఎలాగూ ఆనం కుటుంబానికి టీడీపీతో అనుబంధం ఉంది. ఆనం వియ్యంకులు టీడీపీలోనే ఉన్నారు. ఆనం కుమార్తె కూడా టీడీపీ అధినాయకత్వంతో టచ్ లోనే ఉంటున్నారు. సో.. ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ టికెట్ పెద్ద కష్టం కాకపోవచ్చు. ముందుగానే తమ భవిష్యత్ ప్రణాళికను రెడీ చేసుకున్న రెబల్ ఎమ్మెల్యేలు, ఇప్పటికిప్పుడు పార్టీ మారే సాహసం చేయడంలేదు. పార్టీ ఫిరాయించారు అనే అపవాదు మోయాలనుకోవడంలేదు. సింపుల్ గా జగన్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. కుటుంబానికి కండువా కప్పేస్తున్నారు, తాము మాత్రం సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News