బాబు సవాల్ కి వైసీపీ రియాక్షన్
వైసీపీ హయాంలో రూ. 2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు సజ్జల. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అడిగారు.
"దమ్ముంటే అభివృద్ధిపై నాతో చర్చకు రా.. ప్లేస్, టైమ్ నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా. దేనిమీదైనా చర్చిస్తా.." అంటూ చంద్రబాబు, జగన్ కు విసిరిన సవాల్ పై వైసీపీ స్పందించింది. వైసీపీ తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారని.. అయితే అంతకు ముందే చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి ఏంటో చెప్పాలని నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మంచి ఏంటో చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాలేమని తెలిసి చంద్రబాబు సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు సజ్జల.
తమ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని సీఎం జగన్ అడుతున్నారని, ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు సజ్జల. తన పాలనలో ఫలానా మంచి జరిగిందని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క ఛాన్స్ కూడా లేదన్నారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని ప్రశ్నించారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని తెలిపారు సజ్జల.
వైసీపీ హయాంలో రూ. 2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు సజ్జల. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అడిగారు. చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలని, టీడీపీ పాలన చెత్తపాలన అని గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఏపీలో కౌంట్ డౌన్ మొదలైందని, ఇంకో 50 రోజుల్లో ప్రజలే తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో బయటపెడతారని చెప్పారు సజ్జల. సీఎం జగన్ పై వ్యతిరేకత ఉంటే చంద్రబాబుకు పొత్తులు ఎందుకని ప్రశ్నించారు.