ఏపీ శాసన మండలి చైర్మన్ నా హక్కులకు భంగం కలిగిస్తున్నడు
రాజీనామా చేసి రెండు నెలలు దాటినా ఆమోదించడం లేదు : ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసి రెండు నెలలు దాటినా ఆమోదించకుండా తన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నాడని ఒక ప్రకటనలో మండపడ్డారు. రాజీనామాను తానే స్వయంగా తీసుకెళ్లి మండలి చైర్మన్ కు ఇచ్చానని, ఆ తర్వాత రాజీనామా ఆమోదించాలని కోరుతూ పలుమార్లు మండలి చైర్మన్ ను కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. గురువారం కూడా చైర్మన్ ను కలిసి తన రాజీనామాకు ఆమోదం తెలుపాలని కోరానని అన్నారు. అయినా ఇంతవరకు చైర్మన్ తన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు తిరుపతి నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. కరోనాతో ఆయన మరణించడంతో ఆయన తనయుడు కల్యాణ చక్రవర్తిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌన్సిల్ కు పంపారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, తనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆశించినా జగన్ ససేమిరా అన్నారు. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న కళ్యాణ చక్రవర్తి, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.