దుర్మార్గులు, ద్రోహులు, చరిత్ర హీనులు.. వైసీపీ శాపనార్థాలు
ఉదయం పోలింగ్ సమయంలో గెలుపుమాదే, ఏడు స్థానాలు మావేనంటూ మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. రిజల్ట్ చూశాక మాత్రం మాట మార్చారు. చంద్రబాబు గెలిచిందేంటి.. తాము ఓడిందేంటి అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 7 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాల్లో గెలిచింది. టీడీపీ ఒక స్థానంలో పోటీ చేసి, ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నికలకు ముందు బలం లేని టీడీపీ బలహీన వర్గాలకు చెందిన ఆడపడుచుని అవమానించేందుకే పోటీలో నిలబెట్టిందని వైసీపీ నుంచి చాలామంది సింపతీ చూపించారు. ఇప్పుడు అదే బీసీ మహిళ వైసీపీకి షాకిచ్చారు. అయిందేదో అయిపోయింది, ఫలితాలపై వైసీపీ రియాక్షన్ చూస్తేనే గమ్మత్తుగా ఉంది.
ఉదయం పోలింగ్ సమయంలో గెలుపుమాదే, ఏడు స్థానాలు మావేనంటూ మంత్రులు ధీమా వ్యక్తం చేశారు, రిజల్ట్ చూశాక మాత్రం మాట మార్చారు. చంద్రబాబు గెలిచిందేంటి.. తాము ఓడిందేంటి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కన్నబాబు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల సంఖ్యా బలం ప్రకారం వారికి ఓ స్థానం వచ్చిందన్నారు, తమ సంఖ్యా బలం ప్రకారం తమకు ఆరు స్థానాలు దక్కాయని.. ఇక్కడ గెలుపు ఓటముల ప్రశ్న ఏముందని అన్నారు.
ద్రోహులు, దుర్మార్గులు..
పార్టీలో ఉంటూ పార్టీకే ద్రోహం చేసిందెవరో తేటతెల్లమైందని అన్నారు మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు దుర్మార్గులెవరో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
చరిత్ర హీనులు..
చంద్రబాబు ప్రలోభాలకు ఇద్దరు అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇది చంద్రబాబు పతనానికి పరాకాష్ట అని అన్నారు. నమ్మిన వారిని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. అమ్ముడైనవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు జోగి రమేష్. చంద్రబాబుని నమ్ముకుంటే రాజకీయ సమాధేనని, ఆ విషయం వారు త్వరగానే తెలుసుకుంటారన్నారు. మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, వైసీపీలో అంతర్గత పోరుకి ఆజ్యం పోశాయనే చెప్పాలి.