వైఫల్యంపై ఆత్మ పరిశీలన.. విజయసాయి కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే, వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో ఓటమిపాలైనా, పార్లమెంట్ లో టీడీపీతో తమ బలం దాదాపు సమానం అని చెప్పారు.

Advertisement
Update:2024-06-12 16:30 IST

ప్రజా తీర్పుని అన్ని పార్టీలు అంగీకరించాలని, ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లను కూడా ప్రజాతీర్పులో భాగంగానే చూస్తామని తెలిపారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ జతకట్టారని, పొత్తులతోనే ఆయన విజయం సాధించారని అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమావేశమైన నేతలు ఏపీలో అత్యంత భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఏపీ పరిస్థితులపై ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ అకృత్యాలను వివరించామని చెప్పారు వైసీపీ నేతలు.


Full View

తమపై దాడులు చేస్తూ, చివరికి తామే దాడులు చేస్తున్నట్టుగా వక్రీకరించి చెబుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీలు. చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు, గూండాలు చేస్తున్న దాడుల వీడియోలను కూడా తాము సేకరించామని, బాధితులు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు తీసుకోడానికి కూడా పోలీసులు భయపడుతున్నారని అన్నారు.

వ్యూహాత్మకంగానే..

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాడులు జరిగితే, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతో.. ఆ కార్యక్రమానికి ముందే వ్యూహాత్మకంగా వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేశారని అన్నారు విజయసాయిరెడ్డి. వారి కుటుంబ సభ్యులపై దాడులు జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని తాను చంద్రబాబుకి సూచిస్తున్నట్టు తెలిపారాయన. ఏపీలో చంద్రబాబు, లోకేష్ రక్త చరిత్ర సృష్టిస్తున్నారని మండిపడ్డారు.ఈ హింసకు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీలో టీవీ-9, ఎన్టీవీ, సాక్షి సహా మరికొన్ని మీడియా సంస్థల ప్రసారాలను అడ్డుకుంటున్నారని, కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు విజయసాయిరెడ్డి. 27 సంఘటలను లిస్ట్ చేసి రాష్ట్రపతికి, ప్రధానికి నివేదిక రూపంలో పంపించామన్నారు.

మేమేం తక్కువ కాదు..

పార్లమెంట్ లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే, వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో ఓటమిపాలైనా, పార్లమెంట్ లో టీడీపీతో తమ బలం దాదాపు సమానం అని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి బిల్లులు పాస్ కావాలంటే తమ మద్దతు కూడా అనివార్యం అని వివరించారు. అయితే రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిల్లులపై తమ నిర్ణయాలు ఉంటాయని, వైసీపీ దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పారు విజయసాయిరెడ్డి. అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిస్తాం కానీ, తమ మద్దతు బీజేపీకి కాదని అన్నారు విజయసాయిరెడ్డి. 

Tags:    
Advertisement

Similar News