పరువు నష్టం దావా వేస్తా.. వైసీపీ ఎంపీ హెచ్చరిక
మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దహనం ఘటనపై టీడీపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో అగ్నిప్రమాదం ఘటన ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. టీడీపీ నేతలంతా మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మదనపల్లిలో జరిగిన భూ అక్రమాలను కప్పి పుచ్చుకోడానికే ఫైళ్లు తగలబెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. టీడీపీ నేతలపై మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దహనం ఘటనపై టీడీపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తమ ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయని చెప్పారు. అన్నీ క్లారిటీగా ఉన్నా ఇంకా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారాయన.
టీడీపీ అనుకూల మీడియాలో తమపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు మిథున్ రెడ్డి. కనీసం తమ వివరణ కూడా తీసుకోవడం లేదన్నారు. ఇలాగే కొనసాగితే వారిని కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఘటనలో అరెస్ట్ అయిన అనురాగ్ అనే వ్యక్తి టీడీపీకి చెందిన వారని అన్నారు మిథున్ రెడ్డి. అయినా సరే ఆ ఘటనతో వైసీపీకి సంబంధం ఉందన్నట్టు అనుమానం కలిగేలా తప్పుడు కథనాలు రాస్తున్నారని చెప్పారు. రికార్డులు తారుమారు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాను కనీసం ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదని, తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి.