జగన్ నాకు అదే చెప్పారు.. నేను పార్టీ మారను

వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎంపీలిద్దరూ బీసీలు కావడం, ఆర్.కృష్ణయ్య కూడా బీసీ నేత కావడంతో ఆయనపై కూడా పుకార్లు ఎక్కువయ్యాయి.

Advertisement
Update:2024-08-30 12:27 IST

మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాలతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. వారితోపాటు మరికొందరు ఎంపీలు వైసీపీ నుంచి ఫిరాయిస్తారన్న వార్తల నేపథ్యంలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే కొందరు ఎంపీలు తాము వైసీపీలోనే ఉంటామని, జగన్ తోనే తమ ప్రయాణం కొనసాగిస్తామని, తమపై వచ్చేవన్నీ తప్పుడు వార్తలేనని వివరణ ఇస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తామెక్కడికీ వెళ్లడం లేదని, వైసీపీలోనే ఉంటామన్నారు. తాజాగా ఆర్.కృష్ణయ్య కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.


బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య రాజకీయ అరంగేట్రం టీడీపీ ద్వారా జరిగింది. తెలంగాణలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఆ తర్వాత ఏపీలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు వైసీపీనుంచి బయటకు వచ్చిన ఇద్దరూ బీసీలే కావడం, ఆర్.కృష్ణయ్య కూడా బీసీ నేత కావడంతో ఆయనపై కూడా పుకార్లు ఎక్కువయ్యాయి. టీడీపీతో పాత స్నేహం కొనసాగిస్తారని, కృష్ణయ్య కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరతారని వార్తలొచ్చాయి. దీంతో ఆయనే నేరుగా మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. జగన్ తోనే తన ప్రయాణం అని చెప్పారు ఎంపీ ఆర్.కృష్ణయ్య.

ప్రస్తుతం పార్టీ మారిన ఇద్దరు వ్యక్తిగత అవసరాలకోసమే బయటకు వెళ్లారని చెప్పారు కృష్ణయ్య. వారితో తాను మాట్లాడానని, పార్టీని వీడి వెళ్లొద్దని నచ్చజెప్పానని అన్నారు. అంతకు మించి వారి వ్యవహారంలో తాను కామెంట్ చేయబోనన్నారు. పార్టీ మారిన వారిపై కృష్ణయ్య ఎలాంటి విమర్శలు చేయలేదు. తనకు జగన్ పెద్ద బాధ్యత అప్పగించారని, బీసీలకోసం పోరాటం చేయాలని చెప్పారని అన్నారు. తాను జగన్ తోనే ఉంటానని, పార్టీ మారబోనని ప్రకటించారు. బీసీల అభ్యున్నతే తన అజెండా అన్నారు కృష్ణయ్య.

Tags:    
Advertisement

Similar News