వాలంటీర్ కాళ్లు కడిగిన ఎమ్మెల్యే..
ఎస్సీ మహిళా వాలంటీర్ జె. రజిత కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆర్కే ఆమెకు సన్మానం చేశారు. వాలంటీర్ల ఔన్నత్యాన్ని అందరూ గుర్తించాలన్నారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం రెండు రోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు, బదులుగా వాలంటీర్లు చేస్తున్న నిరసనలతో ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్లకు కాళ్లు కడిగి వార్తల్లోకెక్కారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గిరిజన బాధితుడికి కాళ్లు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకున్నారు. అయితే అసలు బాధితుడు అతడు కాకపోవడం అక్కడ కొసమెరుపు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలకు వాలంటీర్లు బాధితులు అనే కోణంలో వారి కాళ్లు కడిగారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎస్సీ మహిళా వాలంటీర్ జె. రజిత కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆమెకు సన్మానం చేశారు. వాలంటీర్ల ఔన్నత్యాన్ని అందరూ గుర్తించాలన్నారు. వాలంటీర్లకు తాము అండగా ఉంటామని తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు ఎమ్మెల్యే ఆర్కే.
మరోవైపు వాలంటీర్ల నిరసనలు ఈరోజు కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టారు వాలంటీర్లు. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వెంటనే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పవన్ వైపునుంచి మాత్రం క్షమాపణ వచ్చేలా లేదు. సోషల్ మీడియాలో వాలంటీర్ల లీలలు అంటూ జనసైనికులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయినా అందరు వాలంటీర్లను తాము అనలేదని, కొంతమంది మాత్రమే తప్పుడు పనులు చేస్తున్నారని, తప్పుడు పనులకు సహకరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ మాట్లాడటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.