వైసీపీ టు బీజేపీ వయా జనసేన.. ఓ ఎమ్మెల్యే ప్రయాణం
పొత్తుల్లో తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీకి లభించే అవకాశముంది. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున వరప్రసాద్ బరిలో దిగుతారు.
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు టీడీపీ, జనసేనలో చేరారు, వారిలో కొందరు ఆయా పార్టీల తరపున టికెట్లు కూడా సాధించారు, కానీ బీజేపీ వైపు మాత్రం ఎవరూ చూడలేదు. ఇప్పుడు ఓ వైపీసీ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ కాషాయం గూటికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ.. తిరుపతి లోక్ సభ సీటు కేటాయించే అవకాశముంది.
2014లో వైసీపీ తరపున తిరుపతి ఎంపీగా గెలిచారు వరప్రసాద్, 2019లో తిరిగి వైసీపీ టికెట్ పై గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో మాత్రం ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్లుగా రాజకీయ పునరావాసం కోసం ప్రయత్నిస్తున్న వరప్రసాద్, ఎట్టకేలకు ఇప్పుడు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వరప్రసాద్ సిట్టింగ్ స్థానం గూడూరులో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. అంటే ఆ సీటు వరప్రసాద్ కి ఇవ్వలేరు. ఇక మిగిలుంది తిరుపతి లోక్ సభ స్థానం. పొత్తుల్లో ఆ స్థానం బీజేపీకి లభించే అవకాశముంది. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున వరప్రసాద్ బరిలో దిగే అవకాశముంది.
ముందు జనసేన, ఇప్పుడు బీజేపీ..
వరప్రసాద్ ని చాన్నాళ్లుగా సీఎం జగన్ దూరం పెట్టారు. స్థానికంగా ఆయన అందుబాటులో ఉండరని, పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనరనే అపవాదు ఉంది. అందుకే గూడూరులో జగన్ ప్రత్యామ్నాయం చూసుకున్నారు. దీంతో వరప్రసాద్ ముందుగా పవన్ కల్యాణ్ ని కలిశారు. అక్కడ వర్కవుట్ కాకపోయే సరికి బీజేపీకి చేరువయ్యారు. పురందేశ్వరితో ఆల్రడీ ఓసారి భేటీ అయ్యారు. బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు నేరుగా ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు వరప్రసాద్.