చేతులెత్తి మొక్కుతా, పనులు చేయండి- వైసీపీ ఎమ్మెల్యే
మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా.. పనులు జరగాలని చెప్పారు ఎమ్మెల్యే. ప్రజల్ని ఓట్లు అడుక్కోవాలి కాబట్టి.. ముందుగానే పనులు చేయండి అంటూ అధికారుల్ని అడుక్కుంటున్నానని అన్నారు.
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే, రెండుసార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మాత్రం చేయించుకోలేకపోతున్నారు. ప్రజలు నిలదీస్తున్నా పనులు మాత్రం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా తానే చెప్పినా అధికారులు వినడంలేదని, కాంట్రాక్టర్లు కూడా తన మాట పెడచెవిన పెడుతున్నారని అన్నారు. ఇదేదో పార్టీ అంతర్గత సమావేశంలో జరిగి ఉంటే ఈ బాధ బయటకు వచ్చేది కాదు, కానీ ఆయన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తన ఆవేదన వెళ్లగక్కారు. అధికారులూ మీకు చేతులెత్తి మొక్కుతా మా ప్రాంతంలో పనులు చేయండి అని వేడుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు పనులు జరగవు అనే విషయం తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చుక్కలు చూపెట్టడం ఖాయం. అధికారులు కూడా అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతారనడంలో అనుమానమేం లేదు. కానీ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే అక్కడక్కడా ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫా కౌన్సిల్ మీటింగ్ లో భావోద్వేగానికి గురి కావడమే దీనికి నిదర్శనం.
మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా.. పనులు జరగాలని చెప్పారు ఎమ్మెల్యే ముస్తఫా. ప్రజల్ని ఓట్లు అడుక్కోవాలి కాబట్టి.. ముందుగానే పనులు చేయండి అంటూ అధికారుల్ని అడుక్కుంటున్నానని అన్నారు. తన నియోజకవర్గంలో అధికారులు అభివృద్ధికి సహకరించడంలేదని, తన మాట పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ముస్తఫా. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కలకలం రేగింది. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అధికారులు సహకరించడంలేదని పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడాయన పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తనకు అధికారులు సహకరించడంలేదని ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై అధిష్టానం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. గుంటూరు అధికారులను మందలిస్తారా, లేక ఎమ్మెల్యేనే సర్దుకుపోవాలని చెబుతారా..? వేచి చూడాలి.