పాపం ఎన్టీఆర్.. వైసీపీ మూకుమ్మడి సానుభూతి

ఈ ఎపిసోడ్ లో ఒకే ఒక్క హైలైట్ ఏంటంటే.. వైసీపీ నేతలు గుర్తు చేసినా, చేయకపోయినా.. చంద్రబాబు విషయం బాగా తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

Advertisement
Update:2023-08-29 16:21 IST

ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా టీడీపీ నేతల కంటే ఎక్కువగా వైసీపీ నేతలు ఆయన్ను తలచుకున్నారు. ఆయనపై సానుభూతి చూపించారు. కుటుంబం అంతా ఏకమైపోయిందని, అసలు చంద్రబాబుని ఎలా దగ్గరకు రానిచ్చారని నిలదీశారు. ఎన్టీఆర్ ఫంక్షన్ కి వెళ్లి చంద్రబాబు ఢిల్లీలో రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అబ్బెబ్బే చంద్రబాబు చేయాలనుకున్నా నడ్డాజీ ఆయన మాటలు చెవిలోకి ఎక్కించుకోలేదని, చంద్రబాబు ఆటలు సాగలేదని పెదవి విరిచారు. పురందేశ్వరి-ఎన్టీఆర్ వ్యవహారంపై నిన్న లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో మండిపడగా, ఈ రోజు పోసాని కృష్ణ మురళి ఆ బాధ్యత తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఎన్టీఆర్‌ మొహం మీద చంద్రబాబు చెప్పులు వేయించారన్నారు. ఆయన్ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటని అన్నారు. ఎన్టీఆర్‌ పై చెప్పులు వేయించిన చంద్రబాబును, ఆయన కుమార్తె పురందేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు పోసాని. అసలు చంద్రబాబుని రాష్ట్రపతి కార్యక్రమానికి ఎందుకు పిలిచారని అన్నారు పోసాని. తండ్రిని అవమానించిన వారిని ప్రశ్నించే కనీస బాధ్యత కుమార్తెలు, కొడుకులకు లేదా అని అడిగారు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ ఎపిసోడ్ లో వైసీపీ నేతలు ఎన్టీఆర్ పై విపరీతమైన సానుభూతి చూపించడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కనీసం టీడీపీ నేతలు కూడా ఆ స్థాయిలో ఎన్టీఆర్ ని తలచుకుని ఉండరు. రెండురోజులుగా వైసీపీ సానుకూల మీడియా, సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ పై సానుభూతి పెల్లుబికి పోతోంది. అదే సమయంలో వెన్నుపోటు ఎపిసోడ్ ని కూడా బాగానే జనాలకు గుర్తు చేయాలనే ప్రయత్నం కనపడుతోంది. నగరిలో విద్యాకానుక నిధుల జమ సభలో కూడా సీఎం జగన్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ గుర్తు చేశారంటే 100 రూపాయల నాణెం విడుదల సమయంలో ఆ పార్టీ ఎంతగా ఉచిత ప్రచారం చేసిందో అర్థమవుతుంది. ఢిల్లీలో నందమూరి-నారా-దగ్గుబాటి కుటుంబాల కలయిక ఏపీ రాజకీయాల్లో టీడీపీకి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ ఎపిసోడ్ లో ఒకే ఒక్క హైలైట్ ఏంటంటే.. వైసీపీ నేతలు గుర్తు చేసినా, చేయకపోయినా.. చంద్రబాబు విషయం బాగా తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 


Tags:    
Advertisement

Similar News