గవర్నర్ ని కలసిన వైసీపీ నేతలు.. ఎందుకంటే..?

బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు బొత్స సత్యనారాయణ.

Advertisement
Update:2024-05-16 19:46 IST

ఎన్నికల టైమ్ లో దాడులు, ప్రతి దాడులు జరిగినా.. పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రం కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కానీ ఏపీలో ఎలక్షన్ తర్వాతే గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు నేరుగా గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అబ్జర్వర్ పై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరించారని మండిపడ్డారు.

బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ.. తదితరులు రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైసీపీ నేతలపై టీడీపీ దాడులు పెచ్చుమీరాయని ఫిర్యాదు చేశారు. అనంతపురం సహా ఇతర జిల్లాల్లో పోలీస్ అధికారులు.. లా అండ్ ఆర్డర్ పరిరక్షించడంలో విఫలమయ్యారని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల టైమ్ లో బదిలీలు జరిగిన ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు ఎక్కువయ్యాయని చెప్పారు.

బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు బొత్స సత్యనారాయణ. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే అబ్జర్వర్ దీపక్ మిశ్రా విచారణ చేపట్టకుండానే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆయన నియామకంపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని, పోలింగ్ పూర్తయినా కూడా ఆయన ఏపీ వదిలి వెళ్లటం లేదన్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ని కోరారు వైసీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News