జనసేన ఎమ్మెల్యేకి వైసీపీలో ప్రమోషన్
కర్నూలు సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ స్థానంలో బీవై రామయ్యకు అవకాశమిచ్చారు సీఎం జగన్. అమలాపురం ఎంపీ చింతా అనురాధ స్థానంలో రాపాక వరప్రసాదరావుకి ఛాన్స్ దొరికింది. రాపాక ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలు అసెంబ్లీ స్థానం గొల్లపల్లికి వెళ్లింది.
సిద్ధం సభలు పూర్తయ్యేలోపు దాదాపుగా ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల్ని ఖరారు చేయాలనుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు ఖరారైన సీట్లు దాదాపుగా ఫైనల్ అని చెబుతున్నా కూడా అక్కడక్కడ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని స్థానాలకు ఇంకా అధికారిక ప్రకటనలు విడుదల కాకపోవడంతో సిట్టింగ్ ల్లో భయం ఉంది. మరోవైపు జగన్ మాత్రం రెండు, మూడు స్థానాలను ఖరారు చేసి లిస్ట్ లు విడుదల చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి లిస్ట్ మరొకటి బయటకొచ్చింది.
వైసీపీ తాజా జాబితా..
కర్నూలు లోక్ సభ స్థానం - బీవై రామయ్య
అమలాపురం లోక్ సభ స్థానం - రాపాక వరప్రసాదరావు
రాజోలు అసెంబ్లీ స్థానం - గొల్లపల్లి సూర్యారావు
కర్నూలు సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ స్థానంలో బీవై రామయ్యకు అవకాశమిచ్చారు సీఎం జగన్. అమలాపురంలో ఎంపీ చింతా అనురాధ స్థానంలో రాపాక వరప్రసాదరావుకి ఛాన్స్ దొరికింది. రాపాక ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలు అసెంబ్లీ స్థానం గొల్లపల్లికి వెళ్లింది.
2019 ఎన్నికల్లో జనసేన టికెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేయగా ఆ లిస్ట్ లో మాత్రం రాపాక లేరు. ఆయనపై జనసేన ఫిర్యాదు చేయకపోవడంతో వేటు నుంచి తప్పించుకున్నారు రాపాక. తనకు ఎంపీ సీటు ఇచ్చినా, తిరిగి రాజోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయమన్నా కూడా తాను సిద్ధం అని ఇటీవల ప్రకటించారాయన. ఆయనకు అనూహ్యంగా ఎంపీ సీటు లభించింది. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి రాపాక వరప్రసాద్ వైసీపీ టికెట్ పై లోక్ సభకు పోటీ చేయబోతున్నారు.