జగన్ కి తలనొప్పిగా యలమంచిలి

యలమంచిలిలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేను అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికలనాటికి ఈ గొడవలు మరింత పెరిగే అవకాశముంది. ఈ సమస్యని సీఎం జగన్ సామరస్యంగా పరిష్కరిస్తారా లేదా వేచి చూడాలి.

Advertisement
Update:2023-05-01 08:55 IST

వైసీపీ నుంచి ఆ నలుగురిని సస్పెండ్ చేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కాస్త అలర్ట్ అయ్యారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, గడప గడప వంటి కార్యక్రమాలను లైట్ తీసుకున్నా, ఐప్యాక్ దృష్టిలో బలహీనంగా ఉన్నా.. టికెట్ రాదని తేలిపోయింది. దీంతో దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు హడావిడి పడుతున్నారు. కార్యకర్తలకంటే ఎక్కువగా ఐప్యాక్ టీమ్ ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. స్థానిక అసంతృప్తుల్ని బుజ్జగిస్తున్నారు. కానీ యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు లాంటి వారు మాత్రం లోకల్ పాలిటిక్స్ ని సెట్ రైట్ చేయలేకపోతున్నారు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. కన్నబాబు వద్దు – జగనన్న ముద్దు అంటూ కొన్నిరోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వైరి వర్గం కన్నబాబు రాజుకి చుక్కలు చూపెడుతోంది. తాజాగా అచ్యుతాపురం మండలం పూడి మడకలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు రోడ్డెక్కాయి. ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆగ్రహంతో ఓ నాయకుడిపై చేయి చేసుకోవడంతో వ్యవహారం మరింత ముదిరిపోయింది. చివరకు పోలీసులు వచ్చి సర్దుబాటు చేశారు.

కన్నబాబు రాజుకి టికెట్ దక్కేనా..?

ఎమ్మెల్యే కన్నబాబు రాజుకి టికెట్ ఇస్తే ఈసారి కచ్చితంగా ఓడిస్తామంటున్నారు వైసీపీలోని వైరి వర్గం నాయకులు. దీంతో యలమంచిలి సీటు వ్యవహారం సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. గడప గడపలో నిరసనలంటూ ఓవైపు టీడీపీ అనుకూల మీడియా హోరెత్తిస్తుంటే, ఇక్కడ సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేను అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికలనాటికి ఈ గొడవలు మరింత పెరిగే అవకాశముంది. ఈ సమస్యని సీఎం జగన్ సామరస్యంగా పరిష్కరిస్తారా లేదా వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News