నిన్న బ్రో, నేడు భగవంత్ కేసరి.. వైసీపీ ఫ్రీ పబ్లిసిటీ

వైసీపీ వాళ్లు మాత్రం బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలయ్యే సమయంలో హడావిడి చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నారు.

Advertisement
Update:2023-10-20 15:11 IST

సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడంలో వైసీపీ నేతలను మించినోళ్లు లేరు. అందులోనూ వైరి వర్గం వారి సినిమాలంటే వారికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తాజాగా బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ రిలీజైంది. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే అయినా.. పార్టీ పరంగా ఎక్కడా సినిమా గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ వైసీపీ ఉచిత పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. చంద్రబాబు జైలులో ఉంటే అసలు బాలయ్య సినిమా ఎలా రిలీజ్ చేస్తారంటూ రాగాలు తీశారు కొంతమంది నేతలు. బావ బాధపడుతుంటే, బావమరిది సంతోషంగా సినిమా ఫంక్షన్లకు ఎలా హాజరవుతారు, అసలు తన సినిమా ఎలా రిలీజ్ చేస్తారంటూ లాజిక్ తీశారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వంటి ఒకరిద్దరు నాయకులే కాదు, వైసీపీ సోషల్ మీడియా కూడా.. బ్రహ్మాండమైన పాయింట్ పట్టుకున్నామంటూ భగవంత్ కేసరి సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ మొదలు పెట్టింది.

అప్పట్లో బ్రో..

ఆ మధ్య పవన్ కల్యాణ్ బ్రో సినిమాకు స్వయానా మంత్రి అంబటి రాంబాబు ఉచిత పబ్లిసిటీ ఇచ్చారు. అందులో శ్యాంబాబు అనే పాత్ర పేరుతో తనను వెటకారం చేశారంటూ అంబటి రోజుకో ప్రెస్ మీట్ పెట్టారు. అంతే కాదు, ఏకండా ఢిల్లీ వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేస్తానంటూ హడావిడి చేశారు. సినిమా కలెక్షన్ల లెక్క తీయాలని, బడ్జెట్ లెక్కలు చెప్పాలని, హీరో రెమ్యునరేషన్ లెక్కలు కావాలని హంగామా చేశారు. చివరకు ఏమైంది..? బ్రో కి ఉచిత పబ్లిసిటీ మినహా అంబటి సాధించిందేమీ లేదు. "పోలవరం గురించి కూడా అన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఉండరు, బ్రో కోసం ఎంత కష్టపడ్డారు మంత్రిగారూ" అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ భగవంత్ కేసరిని భుజాన మోస్తున్నారు వైసీపీ నేతలు.

సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఆ అభిమానం అంతా ఇటువైపు వస్తుందనుకోలేం. పోనీ పార్టీ పెట్టినంత మాత్రాన కార్యకర్తలంతా వారి సినిమాలను సూపర్ హిట్ చేస్తారని కూడా అనుకోలేం. కానీ వైసీపీ వాళ్లు మాత్రం బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలయ్యే సమయంలో హడావిడి చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నారు. 


Tags:    
Advertisement

Similar News