వైసీపీ బీసీ అస్త్రాలను లోకేష్, పవన్ తట్టుకోగలరా..?
గాజువాక, మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ ఇన్ చార్జ్ లను ప్రకటించింది. ఆసక్తికర అంశం ఏంటంటే సీట్లు కోల్పోతున్నవారిద్దరూ రెడ్డి సామాజిక వర్గం నేతలు, కొత్తగా ఆ స్థానాల్లోకి వచ్చినవారిద్దరూ బీసీలు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ ని ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఓడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ ని తిప్పల నాగిరెడ్డి ఓడించారు. లోకేష్, పవన్.. ఇద్దర్నీ ఓడించింది రెడ్డి సామాజిక వర్గం నేతలే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల్లో విజేతలిద్దరూ ఆయా స్థానాలను కోల్పోవడం. ఆ ఇద్దరికీ వైసీపీ టికెట్ ఇవ్వడంలేదని క్లారిటీ వచ్చేసింది. గాజువాక, మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ ఇన్ చార్జ్ లను ప్రకటించింది. ఆసక్తికర అంశం ఏంటంటే ఆ ఇద్దరూ బీసీ నేతలు.
మంగళగిరిలో పద్మశాలి అభ్యర్థి..
మంగళగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు, ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచినా, ఈసారి బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. దీంతో అసలు బీసీనే లోకేష్ కి పోటీగా నిలిపితే బాగుంటుందనే ఆలోచన చేశారు సీఎం జగన్. గంజి చిరంజీవిని అక్కడ వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించారు. ఆళ్ల అలిగినా లోకేష్ ని బలంగా దెబ్బకొట్టేందుకు తన వ్యూహం అమలు చేయక తప్పలేదు జగన్. పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఈసారి లోకేష్ కి గట్టి ప్రత్యర్థిగా మారబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉన్నా కూడా.. ఆ సామజాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా చిరంజీవికి పడితే లోకేష్ కి అసెంబ్లీ ఎంట్రీ అందని ద్రాక్షగానే మారిపోతుంది.
గాజువాకలో యాదవ వర్గానికి చెందిన అభ్యర్థి..
గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొడుకు దేవన్ రెడ్డి వైసీపీ టికెట్ పై పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే సీఎం జగన్ ఏరికోరి వరికూటి రామచంద్రరావుని అక్కడ బరిలో దింపుతున్నారు. ఆయనకే ఇన్ చార్జ్ పదవి ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఈసారి కూడా గాజువాకలోనే పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాపుఓట్లు మొత్తం తనకే పడతాయనే ఆశ ఆయనకు ఉంది. ఈసారి కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కే పడినా.. బీసీ ఓట్లు మాత్రం ఆయనకు దూరం అవుతాయని తెలుస్తోంది. రామచంద్రరావు, పవన్ కి గట్టిపోటీ ఇస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా జగన్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
ఇద్దరు కీలక నేతలపై జగన్ ప్రయోగిస్తున్న ఈ బీసీ అస్త్రాలు ఎంతవరకు లక్ష్యాన్ని ఛేదిస్తాయో వేచి చూడాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.