ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ
సీఎం జగన్ చేతుల మీదుగా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అంటూ జాబితాలు విడుదలవుతాయేమో అని అందరూ అంచనా వేస్తున్న వేళ, ఇలా సజ్జల సైలెంట్ గా అభ్యర్థుల్ని ప్రకటించడం విశేషం.
యువగళం పాదయాత్రలో అక్కడక్కడా అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు నారా లోకేష్. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ కూడా అభ్యర్థులను ఖరారు చేసి, ఆ సీటు మనదే, ఈ నియోజకవర్గంలో జెండా మనదేనంటున్నారు. ఇక మిగిలింది వైసీపీ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు ఖరారు అవుతాయని ఈపాటికే ఎమ్మెల్యేలకు, ఇన్ చార్జ్ లకు తేల్చి చెప్పారు సీఎం జగన్. ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి, ఐ ప్యాక్ దృష్టిని ఆకర్షించడానికి తంటాలు పడుతున్నారు నేతలు. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందేమో ముగ్గురు అభ్యర్థుల పేర్లు మాత్రం బయటకొచ్చాయి. విజయవాడలో ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆ ముగ్గురు ఎవరంటే..?
విజయవాడలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సజ్జల.. ముగ్గురు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేస్తారని ఆయన తేల్చి చెప్పారు. ఆ ముగ్గురిని ప్రజలు ఆదరించాలని కోరారు. ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉండగా.. విజయవాడ తూర్పు టీడీపీ చేతిలో ఉంది. అక్కడ గద్దె రామ్మోహన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జ్ గా ఇప్పటికే దేవినేని అవినాష్ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని సజ్జల ఖరారు చేశారు.
లిస్ట్ ఉంటుందా.. ఇలాగే కానిచ్చేస్తారా..?
సీఎం జగన్ చేతుల మీదుగా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అంటూ జాబితాలు విడుదలవుతాయేమో అని అందరూ అంచనా వేస్తున్న వేళ, ఇలా సజ్జల సైలెంట్ గా అభ్యర్థుల్ని ప్రకటించడం విశేషంs. మిగతా అభ్యర్థుల విషయంలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా ప్రకటనలు వస్తాయా లేదా తాడేపల్లి నుంచి లిస్ట్ లు విడుదలవుతాయా అనేది వేచి చూడాలి. ఒకరకంగా జగన్ మనసులోని మాటే సజ్జల బహిరంగంగా చెప్పారు. అసంతృప్తుల విషయంలో అధిష్టానం మరోసారి ఆలోచించుకునే అవకాశం ఉండాలంటే ఇలా హడావిడి లేకుండా పేర్లు ప్రకటించడమే మేలు అంటున్నారు నేతలు.