వివేకా హత్య కేసులో మీడియా తీర్పు..!
అసలు కొత్త బృందం వచ్చి కొత్త ఆధారాలేమైనా సేకరించిందా అని ప్రశ్నించారు సజ్జల. స్టేట్ మెంట్లు తీసుకోవడం తప్ప సీబీఐ దర్యాప్తు చేయడం లేదన్నారు. విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని మండిపడ్డారు.
వైఎస్ వివేకా హత్య కేసుని టీడీపీ అనుకూల మీడియా విచారణ జరుపుతున్నట్టుందని, టీడీపీ అధికారంలో ఉంటే.. సదరు మీడియానే తీర్పు ఇచ్చేసి ఉండేదని అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకా హత్య కేసులో ఓ ప్లాన్ ప్రకారమే మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోందన్నారు. పొలిటికల్ అజెండాలో భాగంగానే టీడీపీ ఈకేసుని వాడుకుంటోందన్నారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోందని విమర్శించారు. తమ పాలనలో ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోవడానికి టీడీపీ దగ్గర ఏం లేదని, అందుకే వివేకా కేసును ఓ పథకం ప్రకారం వాడుకుని, వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోందని చెప్పారు. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా టీడీపీ కుట్ర చేస్తోందన్నారు సజ్జల.
దస్తగిరిని అంత హైలెట్ చేయాలా..?
దస్తగిరి మాటల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ, అతని మాటలకు ఎక్కడలేని ప్రచారం కల్పిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. కావాలనే దస్తగిరిని ప్రలోభపెట్టి మాట్లాడించినట్లు కనిపిస్తోందన్నారు. విపక్షాల పొలిటికల్ అజెండాలో భాగంగానే అవినాష్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. అసలు దస్తగిరిని అప్రూవర్ గా మార్చి బెయిల్ ఇప్పించిందెవరని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షి వాచ్ మన్ రంగన్న మాటల్ని పరిగణలోకి తీసుకోకుండా, దస్తగిరి మాటల్ని సీబీఐ ఎందుకు పట్టించుకుంటోందన్నారు సజ్జల. దస్తగిరిని అప్రూవర్ గా మార్చి, విచారణ పేరుతో డ్రామా నడిపిస్తున్నారని అన్నారు.
కొత్త బృందం ఏం చేసింది?
వివేకా హత్యకేసు విచారణలో ఇటీవలే సీబీఐ విచారణ బృందాన్ని మార్చింది. అసలు కొత్త బృందం వచ్చి కొత్త ఆధారాలేమైనా సేకరించిందా అని ప్రశ్నించారు సజ్జల. స్టేట్ మెంట్లు తీసుకోవడం తప్ప సీబీఐ దర్యాప్తు చేయడం లేదన్నారు. విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని మండిపడ్డారు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారనేదే తమ బాధ అని చెప్పారు సజ్జల. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి.. కొంతకాలం ఇబ్బంది పడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.