పచ్చచీర.. తన పరువు తానే తీసుకున్న షర్మిల
షర్మిల వస్త్రధారణని ఎక్కడా జగన్ ప్రస్తావించలేదు, కేవలం ఆమె రాజకీయ దురుద్దేశాలను మాత్రమే జగన్ ఉదాహరణలతో చెప్పారు.
ఏపీలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో చెప్పడానికి తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. పచ్చ చీర కట్టుకున్నారంటూ షర్మిల, సునీత గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె దారుణంగా వక్రీకరించారు. చెల్లెలి వస్త్రధారణ గురించి జగన్ అంతమంది మగవాళ్ల మధ్య మాట్లాడటమేంటని ప్రశ్నించారు షర్మిల. అసలిక్కడ జగన్ చెప్పిందేంటి..? షర్మిల అర్థం చేసుకున్నదేంటి..? షర్మిల వస్త్రధారణని ఎక్కడా జగన్ ప్రస్తావించలేదు, కేవలం ఆమె రాజకీయ దురుద్దేశాలను మాత్రమే జగన్ ఉదాహరణలతో చెప్పారు. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబు వద్ద మోకరిల్లేవారు, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివేవారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని మాత్రమే ప్రశ్నించారు. కానీ ఆ వ్యాఖ్యల్ని తనకు కన్వీనియంట్ గా మార్చుకున్నారు షర్మిల. జగన్ తన వస్త్రధారణను ప్రశ్నించినట్టు, తనని వ్యక్తిగతంగా అవమానించినట్టు చెప్పుకొచ్చారు షర్మిల.
నిస్సిగ్గుగా జగన్ పై నిందలు..
వైఎస్ షర్మిల వేరు కుంపటి పెట్టుకున్నది కేవలం ఆస్తి పంపకాల్లో తేడాల వల్లేనని ఇటీవల ఆమె మాటల్లోనే అర్థమైంది. తెలంగాణ ఇంటి కోడల్ని అంటూ అక్కడికి వెళ్లి హడావిడి చేసి దుకాణం మూసేశారు. తన తండ్రి మరణం తర్వాత ఏ పార్టీపై నిందలు వేసి బయటకు వచ్చారో, తిరిగి అదే పార్టీలో చేరారు. వైఎస్ఆర్ రాజకీయ బద్ధ శత్రువు చంద్రబాబుతో పరోక్షంగా చేతులు కలిపారు. ఇన్ని చేసికూడా, నిస్సిగ్గుగా ఇంకా జగన్ పై నిందలు వేస్తున్నారు షర్మిల. తనని, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి వారికి షర్మిల బానిసగా మారింది, వారికి మోకరిల్లింది అనేది జగన్ వాదన. కానీ జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరించి సింపతీ కోసం పాకులాడుతున్నారు షర్మిల. పచ్చ చీర కట్టుకున్నారన్న జగన్ మాటల్ని పదే పదే హైలైట్ చేస్తూ తన పరువు తానే తీసుకున్నారు.
చీర రంగు గురించి మాట్లాడితేేనే ఇంత ఇదైపోతున్న షర్మిల, గతంలో ఓ సినీ హీరోతో ఆమెకు సంబంధం ఉందంటూ ఎల్లో మీడియా, కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని మరచిపోయారా..? తన క్యారెక్టర్ ని అవమానంచిన చంద్రబాబు బ్యాచ్ ఇప్పుడు షర్మిలకు కావాల్సిన వాళ్లు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబానికి పెద్దగా ఉన్న అన్న ఇప్పుడామెకు శత్రువు. ఇదెక్కడి న్యాయం..? కేవలం కడప లోక్ సభ ఎన్నికల్లో తన గెలుపుకోసమే జగన్ ని, అవినాష్ ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు షర్మిల. చివరకు అన్న గురించి ఏ చెల్లెలు కూడా అనకూడని మాటలంటున్నారు.