ప్రత్యేక హోదాపై షర్మిల ప్రశ్నలు

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందు డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని విమర్శించారు షర్మిల.

Advertisement
Update:2024-07-01 12:57 IST

బీహార్ కు ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ చేసిన తీర్మానం ఇప్పుడు సంచలనంగా మారింది. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ తీర్మానం చేశారని అంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు ఏపీకి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలనే వాదన వినపడుతోంది. సీఎం చంద్రబాబు కూడా నితీష్ లాగే ధైర్యంగా ముందడుగు వేయాలని, ఎన్డీఏపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. ఓవైపు వైసీపీ ఇదే వాదన వినిపిస్తుండదా, తాజాగా ఆ వాదనతో జతకలిపారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందు డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని విమర్శించారు షర్మిల. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారామె. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే ఏపీ వెనకబడి ఉందని చంద్రబాబుకి తెలియదా అని ప్రశ్నించారు. "ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేవా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ? హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పడంలేదు..? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? అసలు ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పండి.." అంటూ ట్వీట్ చేశారు షర్మిల.


పరోక్షంగా జగన్ పై విమర్శలు..

ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేయండి అని అడిగే క్రమంలో పరోక్షంగా జగన్ పై కూడా విమర్శలు చేశారు షర్మిల. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ, బీహార్ కంటే వెనకపడిందని అన్నారు. ఈ వెనకబాటుకి కారణం జగనేనని, ఆయనే రాజధాని లేకుండా చేశారని పరోక్షంగా విమర్శించారు షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారామె. ప్యాకేజీలతో తృప్తి చెందకుండా, హోదా డిమాండ్ చేయాలన్నారు షర్మిల. 

Tags:    
Advertisement

Similar News